టాలీవుడ్‌లో ప్రస్తుతం మెహ్రీన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించడంతో పాటు, చేసిన దాదాపు అన్ని సినిమాల్లో కూడా అందంతో మరియు అభినయంతో ఆకట్టుకుందని ప్రశంసలు దక్కించుకుంది. అందుకే మెహ్రీన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ అమ్మడు నటిస్తూ వస్తుంది. సందీప్ కిషన్ హీరోగా సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రంలో ఈమె హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాను తెలుగులో ‘కేరాఫ్ సూర్య’ అనే టైటిల్‌తో ఇటీవలే విడుదల చేయడం జరిగింది.
తమిళం మరియు తెలుగులో ఆ సినిమాకు మంచి స్పందన దక్కింది. అయితే సినిమాలో మెహ్రీన్ పాత్ర చాలా తక్కువ ఉంది. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా మెహ్రీన్‌కు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. సినిమా కథ చెప్పిన సమయంలో మెహ్రీన్ పాత్ర గురించి దర్శకుడు ఎక్కువ చెప్పాడు. చిత్రీకరణ సందర్బంగా మెహ్రీన్ పాత్రను చాలా వరకు కట్ చేశాడట. ఇక ఎడిటింగ్‌లో సినిమా నిడివిని తగ్గించేందుకు ఆమె పాత్రను మరింత కుదించడం జరిగిందట. మెహ్రీన్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఆమె పాత్రను చూపించలేక పోయాను అని, అందుకు ఆమెకు క్షమాపణ చెబుతున్నాను అంటూ దర్శకుడు సుశీంద్రన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మెహ్రీన్‌కు చెప్పిన విధంగా ఆమె పాత్రను డిజైన్ చేయలేక పోయాను అంటూ దర్శకుడు సుశీంద్రన్ చెప్పుకొచ్చాడు. ఇలా ఆలోచించే దర్శకులు చాలా అరుదుగా ఉంటారు కదా..!