Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నో..ఎస్ …నో …ఎస్… ఇలా రోజుకో మాట చెబుతూ రజని తన రాజకీయ ఎంట్రీ మీద తానే కుతూహలం తగ్గేలా చేసాడు. చివరకు ఓ సినిమాలో ఆయనే చెప్పిన డైలాగ్ “లేట్ గా అయినా లేటెస్ట్ గా వస్తా “ ని నిజం చేయబోతున్నట్టు పక్కా సమాచారం. ఈసారి రజని పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పింది ఆషామాషీ మనిషి కాదు. ఆయన కుటుంబ సభ్యులు కాదు. రజని కి దగ్గర మిత్రుడు, రాజకీయ నాయకుడు కూడా అయిన మణియన్. ఈయన ఏ విషయంలో అయినా ఆచితూచి మాట్లాడతాడు. అందుకే మణియన్ చెప్పిన మాటలతో రజని పొలిటికల్ ఎంట్రీ ఖరారు అయిపోయింది. మణియన్ ఈ మాటలు మాట్లాడే ముందు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా ఆయనతో గంటన్నర పాటు చర్చలు కూడా జరిపారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మణియన్ కీలక కామెంట్స్ చేసాడు. రజని రాజకీయ రంగప్రవేశం మీద సందేహాలు అనవసరం. ఈ నెల 26 నుంచి 31 మధ్య ఎప్పుడైనా ఆయన దీనికి సంబంధించిన ప్రకటన చేయొచ్చు అని మణియన్ చెప్పగానే ఒక్కసారిగా తమిళ రాజకీయాలు వేడెక్కాయి. ఇక రజని రాజకీయాల్లోకి రాడని ఆయన రాక కోసం ఎదురు చూసిన అభిమానులు మణియన్ ప్రకటనతో సంబరాలు చేసుకుంటున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో మొదలయ్యే రజనితో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక అభిమానులు ఎంత అడిగినా, బీజేపీ ఎంత ఒత్తిడి తెచ్చినా రాజకీయాలలోకి రావడానికి తెగ ఆలోచించిన రజని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోడానికి బలమైన కారణం ఏదో ఉండి ఉండాలి. అదేంటి అని జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ విషయం అర్ధం అయ్యింది. రజని రాజకీయ రంగప్రవేశం గురించి ఓ ప్రకటన వస్తుందని అనుకున్నప్పుడు అనూహ్యంగా కమల్ తెర మీదకు వచ్చాడు. రజని తమిళుడు కాదనే విషయాన్ని ప్రస్తావనకు వచ్చేలా చేసాడు. పైగా డీఎంకే తో కమల్ చెట్టపట్టాలు అందరికీ తెలిసిందే. కమల్ వెనుక డీఎంకే హ్యాండ్ ఉందని రజని అప్పుడే డౌట్ పడ్డారు. కానీ బయటపడలేదు. అంత హడావిడి చేసిన కమల్, రజని సైడ్ అయినట్టు కనిపించగానే తాను కూడా సైడ్ అయ్యారు. చెన్నై కి కూతవేటు దూరంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు జరుగుతుంటే దానిపై కమల్ ఒక్క మాట మాట్లాడలేదు. పైగా ఉప ఎన్నిక అయ్యాక డీఎంకే విజయం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. అటు ప్రధాని మోడీ సైతం తనను వదిలేసి డీఎంకే ప్రాపకం కోసం పాట్లు పడుతున్నారు. ఇదంతా చూసుకున్నప్పుడు కమల్ ఓ వ్యూహం ప్రకారం డీఎంకే కి సాయం చేయడానికే బరిలోకి దిగాడని రజనికి అర్ధం అయ్యిందట. సినిమాల్లో తనను పోటీగా చూసిన కమల్ రాజకీయాల్లోనూ అదే ధోరణితో వ్యవహరించారని అర్ధం కాగానే ఇక వెనకడుగు వేయకూడదని రజని అనుకుంటున్నారట. మొత్తానికి ఆ విధంగా రజని రాజకీయ ఎంట్రీ కి కమల్ కారణం అనుకోవచ్చు.