‘పెళ్లి చూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్‌బాబు ప్రతిష్టాత్మంగా నిర్మించిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. సురేష్ ప్రొడక్షన్స్‌లో మూవీ అనగానే అంతా అంచనాలు పెంచుకున్నారు. కాని అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది. దానికి తోడు ఈ చిత్రం మూస కథ, కథనం మరియు ఏమాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో బోరింగ్‌గా అనిపించింది. విమర్శకులు ఈ చిత్రాన్ని చీల్చి చెండాడారు. ఇప్పటికే సినిమా ఫలితం ఫ్లాప్ అని తేలిపోయింది. కాని దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమాను ఫ్లాప్ అనడం లేదు.
తాజాగా చిత్రానికి సక్సెస్ వేడుక జరిపిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు సినిమా కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాడు. చిత్ర యూనిట్ సభ్యులు పలువురు హైదరాబాద్‌లో సినిమా ఆడుతున్న ప్రతి థియేటర్‌కు వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యపట్టణాల్లో సినిమా ఆడుతున్న ఏరియాకు, థియేటర్లకు వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఫిక్స్ అయ్యింది. భారీ ఎత్తున సినిమాను విడుదల చేసిన సురేష్‌బాబు ఇప్పటికే సగం థియేటర్ల నుండి తొలగించేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఈ వారం పలు పెద్ద, చిన్న చిత్రాలు వస్తున్న కారణంగా ఇంకా ‘ఈ నగరానికి ఏమైంది’కి ప్రమోషన్స్ చేయడం అనవసరం అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాప్ సినిమాకు ఎంత ప్రమోషన్స్ చేసినా ఫలితం శూన్యం.