విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ట్యాక్సీవాలా’. ఈ చిత్రంను గీతాఆర్ట్స్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దాంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. ఫస్ట్‌లుక్ విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. టీజర్ మరియు పోస్టర్‌లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ చిత్రాన్ని గత నెలలోనే విడుదల చేయాలి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ట్యాక్సీవాలాను ఇప్పట్లో విడుదల చేయరని తెలుస్తోంది. పలు కీలక సన్నివేశాలను రీషూట్ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పరిచయ సీన్స్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేవని చిత్ర యూనిట్ సభ్యులు అంతా అనుకుంటున్నారు. అందుకే ఆ సీన్స్‌ను మరియు ఇంకొన్ని సీన్స్‌ను కూడా రీషూట్ చేయాలని భావిస్తున్నారు.
కొత్త దర్శకుడు రాహుల్ క్లారిటీ లేకుండా ఆ సీన్స్‌ను చిత్రీకరించడంతో ప్రస్తుతం వాటిని సరి చేసేందుకు దర్శకుడు మారుతిని రంగంలోకి దించబోతున్నట్లుగా తెలుస్తోంది. మారుతి ఇలాంటి సినిమాలకు మంచి న్యాయం చేస్తాడని, అందుకే ఆయనతో ఈ చిత్రానికి రిపేర్లు చేయించాలని విజయ్ దేవరకొండతో పాటు నిర్మాతలు కూడా నిర్ణయించుకున్నారు. విజయ్ ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు పలు సీన్స్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను మారుతి సిద్దం చేస్తున్నాడు. త్వరలోనే రీ షూట్ షెడ్యూల్‌ను ప్రకటించబోతున్నారు. దాదాపు 15 నుండి 20 రోజుల పాటు చిత్రీకరణ జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని భావించినా ఆనోటా ఈనోటా పడి అందరికి పాకేసింది. రీ షూట్ మరియు ఇతరత్ర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమా సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక విజయ్ మరో చిత్రం ‘గీత గోవిందం’ విడుదలకు సిద్దం అవుతుంది. ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లుగా గీతాఆర్ట్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చేసింది.