నటీ నటులు : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్,
సంగీతం : జేక్స్ బిజాయ్
సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్
నిర్మాత : ఎస్ కె ఎన్ (SKN)
దర్శకత్వం : రాహుల్ సంక్రిత్యాన్
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ సెన్సషనల్ స్టార్ట్ అయిపోయిన విజయ్ దేవరకొండ తన గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్బులో కూడా చేరిపోయాడు. తాను తెలుగు మరియు తమిళ భాషల్లో నటించిన నోటా మూవీ ఘోర పరాజయం పాలవ్వగా, ఇప్పుడు విజయ్ దేవరకొండ తన పూర్తి ఆశలన్నీ టాక్సీవాలా సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా నోటా ముందే విడుదల అవ్వాల్సి ఉండగా, కొన్ని కారణాల వలన వాయిదా పడి, ఈరోజున విడుదల అయ్యింది. సినిమా ట్రయిలర్ తో ఆకట్టుకున్న ఈ టాక్సీవాలా పూర్తి సినిమాగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతుందా అనేది మన ఈ సమీక్షలో చూద్దాం.
కధ :
శివ (విజయ్ దేవరకొండ) అతి కష్టంమీద డిగ్రీ పూర్తిచేసి, తన అన్నావదిన (రవిప్రకాష్, కళ్యాణి) లకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్నబాబాయ్ అని పిలవబడే తన ఫ్రెండ్(మధు నందన్) దగ్గరకు వచ్చేస్తాడు. రకరకాల జాబులు చేసి, ఏది నచ్చకపోవడంతో తన వదిన చేసిన సహాయంతో ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని క్యాబ్ డ్రైవర్ గా ప్రయాణం మొదలుపెడతాడు. తన టాక్సీలో తొలిసారిగా ప్రయాణం చేసిన అను (ప్రియాంక జవాల్కర్) తో ప్రేమలో కూడా పడతాడు. ఈ ఇద్దరి మధ్య ప్రేమవ్యవహారాలతో శివ జీవితం అంత ఆనందం తో సాగుతుండగా, తన కార్ లో దెయ్యం ఉందనే విషయం తెలుస్తుంది. తన కార్ లో ప్రయాణించిన ఒక డాక్టర్ ను కార్ దారుణంగా చంపివేయడంతో, బయపడిపోయిన శివ ఎలాగైనా ఆ కార్ ని వదిలించుకోవాలనుకుంటాడు. కానీ, అది సాధ్యం కాకపోవడంతో శివ ఏమి చేశాడు? ఆ కార్ లో ఉన్న దెయ్యం ఎవరు? ఎందుకు ఆ కార్ నే ఎంచుకొని, కొందరిని చంపుతుంది? ఈ కథలో శిశిర (మాళవిక నాయర్) ఎవరు? యమున కి ఈ కథకి సంబంధం ఏమిటి? ఇంతకీ దెయ్యం శివ ని ఎంచుకుందా? లేక కార్ ని ఎంచుకుందా? ఈ ప్రశ్నల సమాహారమే టాక్సీవాలా సినిమా కథ.
విశ్లేషణ :
టాక్సీవాలా సినిమాకి ప్రధాన ఆకర్షణలు శివ గా నటించిన విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ యొక్క కథ మరియు దర్శకత్వం. అర్జున్ రెడ్డి లో సీరియస్ గా, గీత గోవిందం లో అమాయకుడిగా నటించి, మెప్పించిన విజయ్ దేవరకొండ ఈసారి అల్లరి చేస్తూనే, భయపడే పాత్రలో నటించి మరోసారి మెప్పించాడు. పాత్రకి తగిన స్టైల్ మరియు ఆటిట్యూడ్ తో అదరగొట్టాడనే చెప్పొచ్చు. తెలుగు సినిమాల్లో ఎవరూ ఎక్కువగా టచ్ చేయని సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తన దర్శకత్వ ప్రతిభ తో ప్రేక్షకులను మొదటి నుండి చివరివరకూ కథలో లీనం చేశాడు. ప్రథమార్ధం అంతా విజయ్ దేవరకొండ ఉద్యోగ కష్టాలు, ఫ్రెండ్స్ తో సరదా సన్నివేశాలు, ప్రియాంక జవాల్కర్ తో రొమాంటిక్ ప్రేమ సన్నివేశాలతో రెఫ్రెషింగ్ గా కథని నడిపించాడు. అంతేకాకుండా విజయ్ మరియు ప్రియాంక ల మధ్య నడిపిన లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంది. ప్రియాంక జవాల్కర్ కి నటన కి అంత ప్రాముఖ్యత లేకున్నా, తనకు ఇచ్చిన పాత్రలో గ్లామర్ తో పాటు, అభినయం తో కూడా ఆకట్టుకుంటుంది.
సినిమా ప్రథమార్ధం అంత ఒక మాంచి రైడ్ లా నడిపి, ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాక, ప్రేక్షకుడు తదుపరి పార్ట్ ఎలా ఉండబోతుందో అని నిరీక్షించేలా చేశాడు దర్శకుడు. సెకండ్ పార్ట్ లో హాస్పిటల్ సీన్ చాల ఆసక్తికరంగా సాగగా, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనగా ఒక ఆత్మ మరో ఆత్మతో మాట్లాడడం అనే కొత్త కాన్సెప్ట్ తో కథని మరింత ఆసక్తికరంగా మలిచాడు. తరువాత వచ్చే ఎమోషనల్ సీన్స్ హృదయాన్ని బరువెక్కించేలా ఉండగా, క్లైమాక్స్ ని రెగ్యులర్ గా కాకుండా వేరేలా ప్లాన్ చేసి శభాష్ అని అనిపించుకున్నాడు దర్శకుడు. విజయ్ దేవరకొండ అటు అల్లరి సన్నివేశాలు, భయానక సన్నివేశాలతో పాటు, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బాగా నటించి, తన నటన ఏమిటో మరోసారి రుచి చూపించాడు. శిశిర గా నటించిన మాళవిక నాయర్ ది చిన్న పాత్రే అయినప్పటికీ కథకి కీలక మలుపుగా తన నటనతో ఆకట్టుకుంటుంది. విజయ్ కి ఫ్రెండుగా మధునందన్ మరియు తన అసిస్టెంట్ గా నటించిన ఇంకో అబ్బాయి కూడా ఆకట్టుకున్నారు.
జేక్స్ బిజోయ్ అందించిన సంగీతంలో మాటే వినదుగా అనే పాట హైలైట్ అవ్వగా మిగిలిన పాటలన్ని ఒక మోస్తరుగా అనిపిస్తాయి. కానీ, తాను అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరో ఎత్తు. హార్రర్ మరియు నైట్ సన్నివేశాలని చాలా బాగా తెరకెక్కించాడు. ది ఎండ్ అనే హార్రర్ సినిమాని అందించిన రాహుల్ సాంకృత్యాన్ ఈసారి పెద్ద నిర్మాతల అందతో మరో ఆసక్తికరమైన హార్రర్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు రుచిగా వండించి, థ్రిల్ చేశాడు. గ్రాఫిక్స్ ఈ సినిమాకి నెగటివ్ అంశాలుగా చెప్పొచ్చు.
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్: టాక్సీవాలా తో రైడ్…సరికొత్త థ్రిల్లింగ్
తెలుగు బులెట్ రేటింగ్ :2.75 /5