విజయ్ దేవరకొండ, ప్రియాంక జంటగా తెరకెక్కిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయంతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదలకు ముందు ఎవరికి కూడా పెద్దగా నమ్మకం లేదు. అసలు సినిమా రెండు మూడు రోజులు అయినా ఆడుతుందా అనుకున్నారు. కాని అనూహ్యంగా ట్యాక్సీవాలా రెండు వారాల జోరు రైడ్ కొనసాగించడం ఖాయంగా తేలిపోయింది. ట్యాక్సీవాలా ఇప్పటికే 30 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసింది. ఇలాంటి కలెక్షన్స్ వసూళ్లు దక్కించుకున్న ఈ మూవీ విడుదలకు మూడు నాలుగు నెలల ముందే మొత్తం సినిమా లీక్ అవ్వడం, దాంతో పాటు డోర అనే సినిమా వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి చాలానే జరిగాయి. ఈ చిత్రంను డోర వల్ల నిలిపేయాలనుకున్నారు.
ఈ విషయమై దర్శకుడు సంకృత్యన్ మాట్లాడుతూ.. డోర సినిమా తమ సినిమా కాన్సెప్ట్ ఒక్కటే అని తెలిసి షాక్ అయ్యాను. నేను సొంతంగా రాసుకున్న కాన్సెప్ట్ అలా తమిళంలో నా కళ్ల ముందే సినిమా వస్తుంటే షాక్ అయ్యాను. ఏం చేయాలో పాలుపోక ట్యాక్సీవాలా చిత్రం షూటింగ్ ఆపేశాం. ఏం జరిగితే అదు జరుగుతుంది, డోర విడుదల అయ్యే వరకు ట్యాక్సీవాలాను తెరకెక్కించొద్దని భావించాం. అంతా కూడా నా నిర్ణయానికి ఓకే చెప్పారు. డోర విడుదలయిన వెంటనే వెళ్లి చూశాను. కానీ నా సినిమాకు ఆ సినిమాకు చాలా తేడా ఉంది. స్టోరీ లైన్ ఒక్కటి కాస్త సిమిలర్‌గా ఉన్నా కూడా మిగిలిన సినిమా అంతా కూడా విభిన్నంగా ఉండటంతో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాము అన్నాడు. డోర చిత్రం సెకండ్ హాఫ్ మొత్తం పూర్తి విరుద్దమైన కథతో ట్యాక్సీవాలకు దూరంగా ఉందని దర్శకుడు పేర్కొన్నాడు.