కృష్ణా జిల్లా కీసర వద్ద ఉన్న టోల్ ప్లాజాపై తెలుగు రైతులు దాడి చేసి వీరంగం సృష్టించారు. పోలవరం పరిశీలనకు కొన్ని బస్సుల్లో టీడీపీ కార్యకర్తలు బయలుదేరి వెళుతుండగా, టోల్‌ప్లాజా సిబ్బంది ఆపడంతో తెలుగు దేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ ప్లాజా వద్ద వాటిని ఆపిన సిబ్బంది డబ్బు చెల్లించాలని కోరడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుకు కూడా టోల్ ఫీజ్ చెల్లించాలా, అధికార పార్టీ బస్సులనే ఆపుతారా? అంటూ బస్సుల నుంచి కిందకు దిగిన పదుల సంఖ్యలో కార్యకర్తలు, టోల్ ప్లాజా సిబ్బందితో గొడవకు దిగారు. అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.
కంప్యూటర్లను, అద్దాలను పగులగొట్టి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు. సెక్యూరిటీ సిబ్బందిపై చెయ్యి చేసుకున్నారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సిసి ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.