Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రెండో రోజు జరిగిన సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కృష్ణయ్య తెలుగు సినీ పరిశ్రమను, హీరోలను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. హీరోలకు ధైర్యం, శక్తి, తెలివితేటలు లేవని, నిజజీవితంలో వారు కుక్కను చూస్తే పారిపోతారని విమర్శించారు. సినీ స్టూడియోల్లో ఏం జరుగుతుందనేదానిపై పర్యవేక్షణ లేదని, ఈ విషయంలో సినీ మంత్రిత్వశాఖకు అసలు పట్టింపేలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సినీ పరిశ్రమలో కనిపించని వివక్ష, దోపిడీ, పీడన కొనసాగుతోందని, ఇక్కడ జరుగుతున్న అకృత్యాలపై ఓ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమాజాన్ని ప్రభావితం చేసే సినిమా బలమైన సాధనమని, తెరవెనుక జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలు సినీ పరిశ్రమకు సిగ్గుచేటని మండిపడ్డారు. తెలుగు సినీ హీరోల వద్ద వందల ఎకరాల భూములు ఉన్నాయని, మర్యాదగా ఇస్తే ఏమీ కాదని లేదంటే ఆ భూముల్లో గుడిసెలు వేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. చిత్ర పరిశ్రమలో దళారీ వ్యవస్థను అరికట్టాలని ఈ సమావేశంలో పాల్గొన్న మరో నేత, తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ కోరారు. సినిమాల్లో స్థానిక మహిళలకే అవకాశం కల్పించాలని సూచించారు. గతంలో ప్రభుత్వ సహాయం వల్లే హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందని తెలిపారు. జూనియర్ ఆర్టిస్టులకు పింఛను, ఆరోగ్య కార్డుల విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. నటించాలనే తపనతో వచ్చిన మహిళలను పెద్దలు మోసం చేయడం తగదని, మహిళలు, నటులపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.