ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు మారే నేతల సంఖ్య పెరుగుతోంది. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే రావెల కిషోర్ బాబు, మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ వంటి నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు వారి బాటలోనే మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా టీడీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలో వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. అనకాపల్లి ఎంపీ అవంతీ శ్రీనివాస్ కూడా పార్టీ మారతారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని యోచిస్తున్నారు.
ఈ విషయాన్ని ఇప్పటికే బాబుతో చర్చించారనీ గతంలో అవంతికి ఓకే చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం అసెంబ్లీ టికెట్‌పై క్లారిటీ ఇవ్వడం లేదనీ అందుకే టికెట్ ఇచ్చే పార్టీలోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అవంతి శ్రీనివాస్ పార్టీ మారతారనే వార్తలు గతంలోనే వచ్చాయి. కానీ ఆయన వాటిని ఖండించారు. చంద్రబాబు నాయకత్వంలోనే పని చేస్తానని తెలిపారు. కానీ ఆయన పార్టీ మారతారనే రూమర్లు మాత్రం జోరుగా ప్రచారంలో ఉన్నాయి. విశాఖపట్నంలోని ఆయన నివాసం దగ్గర టీడీపీ జెండాలను సైతం తొలగించినట్లు సమాచారం. అంతేగాక ఆయన జగన్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో ఆయన జగన్ కలుస్తారని తెలుస్తోంది. భిమిలీ అసెంబ్లీ టికెట్‌ను తనకు ఇవ్వాలని, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన వైఎస్ఆర్సీపీ అధినేత ముందు డిమాండ్లు ఉంచినట్టు సమాచారం. అవంతి పార్టీలోకి వస్తుండటంతో విశాఖ జిల్లా పార్టీ నేతలు హైదరాబాద్ రావాలని జగన్ సూచించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గంటా శ్రీనివాస్‌కు సన్నిహితుడైన అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక 2014లో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. భీమిలీ సీటు కోసం అవంతి శ్రీనివాస్ గంటాతో పోటీకి సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది.ఈనెల 24న విశాఖపట్నంలో వైసీపీ సమర శంఖారావం నిర్వహించనుంది. ఆ సభలో జగన్ సమక్షంలో అవంతి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.