Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇవాళ ఎంపీలు మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. తొలుత ఎంపీ తోట నర్సింహం నివాసంలో సమావేశమైన ఎంపీలు అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో నేరుగా రాజ్ ఘాట్ వెళ్లారు. జాతిపితకు నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక హోదా సాధనకు శాంతియుత మార్గంలో నిరసన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజలందరినీ ఏకం చేసి ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని, ఎంపీ గల్లా జయ్ దేవ్ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని, శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని తెలిపారు. అవిశ్వాసతీర్మానంపై చర్చ చేపట్టకుండా కేంద్రం పారిపోయిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజనతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చే బాధ్యత కేంద్రానిదే అని ఎంపీ సుజనా చౌదరి తేల్చిచెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ చేపట్టిన శాంతియుత పోరాటబాటలోనే తామూ పోరాడతామని తెలిపారు. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కేవరకూ పోరుబాట విడిచిపెట్టేది లేదని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎంపీ అశోక గజపతి రాజు మండిపడ్డారు. ప్రధానిని కలిసేందుకు వెళ్తే పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తారా అని ప్రశ్నించారు. దేశమంటే మట్టికాదోయ్..దేశమంటే మనుషులోయ్ అని కేంద్రం గుర్తించాలని, రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించడం సబబు కాదని హితవుపలికారు.