Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంది అవార్డులపై అనవసర రచ్చ చేస్తోన్న వారికి ఏపీ మంత్రి నారా లోకేష్ గట్టి సమాధానమిచ్చారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లు మాత్రమే ఏపీ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డు, ఓటరు కార్డు లేని వారు హైదరాబాద్ లో కూర్చుని నంది అవార్డులపై ఆరోపణలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ స్థానికత లేనివారికి అవార్డుల గురించి విమర్శించే హక్కు లేదన్నారు. పకడ్బందీగా జ్యూరీ ఏర్పాటుచేసి మూడేళ్ల అవార్డులు ఒకేసారి ఇస్తే ముఖ్యమంత్రిపై కొందరు హైదరాబాద్ లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు అవార్డులు ఇవ్వని ప్రభుత్వాన్ని ఏమీ అనని వారు, ఇచ్చిన తమపై రాళ్ల దెబ్బలు వేస్తున్నారని ఆవేదన చెందారు. అవార్డులపై వస్తున్న విమర్శలు చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా బాధపడ్డారని లోకేశ్ తెలిపారు. అవార్డులపై విమర్శలు చేసింది ఇద్దరు ముగ్గురేనని, కొన్ని చానెళ్లు వారిని ప్రధానంగా చూపించడంతో విమర్శలు పెరిగాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో కూర్చుని ఏం చేయాలో చెబితే ప్రజలు హర్షించబోరన్నారు. ప్రత్యేక హోదా అంశంపైనా లోకేశ్ స్పందించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు.