Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీనో బలంగా ఉండి, మిగిలిన పక్షాలన్నీ బలహీనంగా ఉండటం సరైన స్థితి కాదు. అప్పుడు బలమైన పక్షం ఇష్టారాజ్యంగా వ్యవహిరస్తుంది…తద్వారా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇది అందరూ చెప్పేమాటే. కానీ అన్నిసార్లు కాకపోయినా…కొన్నిసార్లుమాత్రం రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ రాజకీయ శూన్యత ఆవరిస్తూ ఉంటుంది. అధికార పక్షానికి తగ్గ ప్రతిపక్షం లేక రాజకీయాలు స్తబ్దుగా ఉంటాయి. కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో దేశంలో పరిస్థితి అలాగే ఉండేది. 2004లో బీజేపీ ఘోర పరాజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీఏకు, ఎన్డీఏ దీటైన ప్రతిపక్షంగా నిలవలేకపోయింది. యూపీఏ ప్రభుత్వం ఐదేళ్ల గడువుపూర్తిచేసుకున్నా.
ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగినా…వారికి సరైన ప్రత్యామ్నాయంగా బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎదగలేకపోయాయి. దీంతో అంతగా ఇష్టం లేకపోయినా దేశప్రజలు కాంగ్రెస్ కు మళ్లీ ఓట్లేయాల్సి వచ్చింది. యూపీఏ రెండోసారి అధికారంలోకి రావటానికి ఆ కూటమి బలం కన్నా ఎన్డీయే బలహీనతే కారణమన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ ఐదేళ్లలో పరిస్థితి మారిపోయింది. వరుస కుంభకోణాలు, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించలేని రాహుల్ గాంధీకి తోడు నరేంద్ర మోడీ లాంటి నేత బీజేపీకి లభించటంతో ఆ పార్టీ చరిత్ర మారిపోయింది.
మోడీ దశదిశలా బీజేపీ ఖ్యాతిని పెంచి పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఇక తరువాత జరుగుతున్న పరిణామాలన్నీ మనకు తెలిసినవే. ఒకప్పుడు కేంద్రలో నెలకొన్న రాజకీయ శూన్యత లాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రస్తుతం నెలకొని ఉంది. పదమూడేళ్లు మడెం తిప్పకుండా ప్రత్యేకరాష్ట్రం కోసం పోరుబాట నడిపిన కేసీఆర్ కు 2014 ఎన్నికల్లో జనం మారు మాట్లాడకుండా పట్టం కట్టారు.
అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ల వరకూ కూడా కేసీఆర్ పై ప్రజల్లో అభిమానం తరగలేదు. అయితే పాలక పక్షంగా ఉన్న ఏ పార్టీపైనయినా…నెమ్మది నెమ్మదిగా ప్రజల్లో వ్యతిరేకత పెరగటం సహజం. అలాగే టీఆర్ ఎస్ ప్రభుత్వంపైనా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. దాంతో పాటు మేధావులు, తెలంగాణ పోరాటంలో చురుగ్గా పనిచేసిన కొన్ని వర్గాలు సొంత రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందనే భావనలో ఉన్నారు. కొన్ని వర్గాలు టీఆర్ ఎస్ పేరు చెబితేనే మండిపడుతున్నాయి.
కేటీఆర్, కవిత వంటి వారితో తెలంగాణ కుటుంబపాలనకు కేంద్రబిందువుగా మారిందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ మలిదశ ఉద్యమంలో తిరుగులేని పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులకు, టీఆర్ ఎస్ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమ గోడు వినిపించేందుకు ప్రత్యామ్నాయ పార్టీ, నేత కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ అసంతృప్తిని అందిపుచ్చుకుని, రాజకీయంగా లబ్ది పొందే శక్తి ఇప్పుడు తెలంగాణ లోని ఏపార్టీకి లేదు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు…ఇలా ఏ పార్టీ అయినా తెలంగాణలో నామమాత్రమే అని చెప్పవచ్చు.
మరి తెలంగాణలో టీఆర్ ఎస్ కు సరైన ప్రతిపక్షంగా ఎదిగే శక్తి ఎవరికి ఉంది…ఏ పార్టీకయినా ఇప్పుడు మోడీ లాగా మ్యాజిక్ సృష్టించే నేత కావాలి. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే పునాదిగా పార్టీని బలోపేతం చేసే బలమైన నాయకుడు ఆవిర్భవిస్తే కానీ…తెలంగాణలో సరైన ప్రతిపక్షం ఏర్పాటు కాదు. లేదంటే ఈ పార్టీలన్నింటిని పక్కనపెట్టి ఓ కొత్త రాజకీయ పార్టీ అన్నా ఏర్పాటు కావాలి. ఆ పార్టీ తెలంగాణలోని మిగిలిన పక్షాలను కలుపుకుని మహా కూటామిగా ఏర్పాటై పోరాటం చేస్తే తప్ప
తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే రాష్టంలో ఉన్న రాజకీయ శూన్యతను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రజాగాయకుడు గద్దర్, తెలంగాణ పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన ప్రొఫెసర కోదండరామ్ వంటి నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకూ సఫలీకృతం అవుతాయో కాలమే చెప్పాలి
మరిన్ని వార్తలు:
శరద్ పై నితీష్ రియాక్షన్ ఏంటి..?
బద్ధశత్రువులతోనూ వెంకయ్య మైత్రి
ఏపీలో హైకోర్టుకు చాలా టైముంది