యువతకు సెల్ఫీల పిచ్చి ఎంతగా ముదిరిందో చెప్పడానికి తార్కాణం ఈ ఘటన. పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడమే నేరం అంటే ఓ యువకుడు ఓటు వేసిన తర్వాత ఏకంగా అక్కడే సెల్ఫీ తీసుకున్నాడు. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓటు వేసి, పోలింగ్ కేంద్రం నుంచి వచ్చిన తర్వాత కొంత మంది సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేసుకోవడం సహజమే. అయితే ఈ యువకుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకోవడం గమనార్హం. ఓటు వేసేటప్పుడు గోప్యత పాటించాలని, ఫొటో తీసినా, సెల్ఫీ దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి రజత్‌కుమార్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఇవేమీ పట్టని సదరు యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రాజేంద్రనగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తూ సెల్ఫీ దిగాడు. పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగిన యువకుణ్ని శివ శంకర్‌గా పోలీసులు గుర్తించారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసును బుక్ చేసినట్లు తెలిపారు.