Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహారాష్ట్ర బెబ్బులి బాల్ థాకరే జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న థాక్రే సినిమా టీజర్ విడుదలయింది. బాల్ థాకరే గా నటిస్తున్న విలక్షణనటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన పాత్రలో ఒదిగిపోయినట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న టీజర్ లో కాషాయ వస్త్రాలు మాత్రమే రంగుల్లో కనిపించాయి. టీజర్ చివర్లో ఓ వ్యక్తి హిందూస్థాన్ కా లీడర్ బాబా సాహెబ్ థాకరే అని పెద్ద గొంతుతో నినదిస్తుండగా… నవాజుద్దీన్ సిద్దిఖీ అశేష జనవాహిని ఎదురుగా నిల్చుని చేతులెత్తి నమస్కరిస్తున్న దృశ్యం… అచ్చంగా బాల్ థాకరేను గుర్తుకుతెచ్చింది. థాకరే బలమైన శివసేన నాయకుడిగా ఎలా మారాడనే అంశాలను ఇందులో చూపించనున్నారు. సినిమాకు పాత్రికేయుడు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కథ అందించగా… మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ జనరల్ సెక్రటరీ అభిజిత్ పన్సే దర్శకత్వం వహిస్తున్నారు.
హిందీ,మరాఠీ భాషలతో పాటు ఇంగ్లీషులోనూ ఈ చిత్రాన్ని 2019 జనవరి 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. థాక్రే పాత్రలో నటిస్తుండడం గర్వంగా ఉందని నవాజుద్దీన్ ట్వీట్ చేశారు. థాక్రే చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల కార్యక్రమానికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్ థాకరే తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అమితాబ్. కూలీ చిత్ర సమయంలో ప్రమాదం జరిగినప్పుడు తన ప్రాణాలు కాపాడింది బాల్ థాకరే అని అమితాబ్ చెప్పారు.
బెంగళూరులో కూలీ చిత్రీకరణ సమయంలో గాయమైందని, అక్కడి నుంచి చికిత్స కోసం ముంబై తీసుకురావాల్సి ఉండగా..భారీ వర్షాల కారణంగా అంబులెన్స్ దొరకలేదని, అప్పుడు బాల్ థాకరే తన కోసం శివసేన అంబులెన్స్ ను పంపించారని అమితాబ్ తెలిపారు. భోఫోర్స్ కుంభకోణం సమయంలో ఆరోపణలు వచ్చినప్పుడు కూడా బాల్ థాకరే తనకు అండగా ఉన్నారని, భయపడకు నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పారని గుర్తుచేసుకున్నారు. బాల్ థాకరే చనిపోవడానికి ముందు ఆయన్ను చూసేందుకు ఉద్ధవ్ తనను అనుమతించారని, ఆయన మంచంపై అలా నిద్రపోవడం చూసి తన హృదయం ద్రవించిందని, అలాంటి పరిస్థితుల్లో ఆయన్ను చూడాల్సొస్తుందని ఎప్పుడూ అనుకోలేదని బిగ్ బీ భావోద్వేగానికి లోనయ్యారు. దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన బాల్ థాకరే 2012 నవంబర్ 17న తుదిశ్వాస విడిచారు.