తిరుమల మణి మంజరి అతిథి గృహంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నగదుతో పాటు పెద్ద మొత్తం బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్‌కు చెందిన విజయ్‌సేన్ రెడ్డి కుటుంబ సభ్యులు 13మంది భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శించుకోవటానికి తిరుమల వచ్చారు. మంగళవారం రాత్రి అతిథి గృహంలోని గదిలో అందరూ నిద్రిస్తున్న సమయంలో లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు 80 తులాల డైమండ్ నగలను, రూ. 2 లక్షల నగదును, 1 సెల్‌ఫోన్‌ను చోరీ చేశారు. ఉదయం తమ నగలు, నగదు దొంగతనానికి గురయ్యాయని గుర్తించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు, పోలీసులు మణి మంజరి అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ గోకులం సర్కిల్ వరకు వెళ్లి ఆగిపోయింది. దీంతో పోలీసులు పద్మావతి సర్కిల్లో వున్న సీపీ పుటేజీని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా మణి మంజరి అతిధి గృహంలోని సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వీరు ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి బంధువులని అంటున్నారు.