ఏపీ రాజధాని జిల్లా గుంటూరులోని పల్నాడు ఏరియా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఒకప్పుడు ఫ్యాక్షన్ పడగ నీడలో ఉండేవి. ఈ విషయాన్ని ఎన్నో సినిమాల్లో పరోక్షంగా చూపించారు కూడా, కాలక్రమేణా అక్కడ ఈ ఫ్యాక్షన్ రక్కసి అణిగిపోతు వచ్చింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పుణ్యమా అని మూడు పంటలు వేస్తూ అక్కడి రైతులు సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఆయా ప్రాంతాల నుండు గత పదేళ్లుగా ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్న టీడీపీ నాయకులు జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు వంటి వారు ప్రత్యర్థులను కూడా మిత్రులను చేసుకుని ప్రాంత అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా ఇక్కడ ఎలాంటి ఘర్షణలు, హత్యలు లేక పోలీసుల జోక్యం రాకుండా ఉన్న వాతావరణం నిన్నటికి నిన్న ఒక్కసారిగా మళ్లీమొదటికి వచ్చింది. మొదటి నుండి శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలు తమ సొత్తుగా భావించే వైసీపీ నాయకులు మళ్లీ తమ పంథాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరదీశారు. నిన్న జరిగిన ఒక మారణ కాండ దీనినే సూచిస్తోంది.
వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం గ్రామంలో సిమెంటు రోడ్డు వేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు టీడీపీ వర్గీయులుగా చెబుతున్న చల్లా వెంకటకృష్ణ (26)తోపాటు గురజాల సోమయ్య (30), మేడబోయిన మల్లికార్జున్ (28) ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే సిమెంటు రోడ్డు వేయడం కుదరదని అదే గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులైన ఎనుగంటి రామకోటయ్య అనుచరులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ గొడవపై వినుకొండకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సిమెంటు రోడ్డు వేయడాన్ని అడ్డుకుంటున్న వైసీపీ వర్గీయులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గురువారం సాయంత్రం వెంకటకృష్ణ, సోమయ్య, మల్లికార్జున్‌లు ముగ్గురూ కలిసి ఒకే బైక్‌పై వినుకొండ బయలుదేరారు. విషయం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు కారుతో వారిని వెంబడించారు.
పసుపులేరు బ్రిడ్జిపై యువకుల బైక్‌ను బలంగా ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ కింద పడ్డారు. అదే సమయంలో గుంటూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీకొట్టడంతో సోమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన వెంకటకృష్ణ, మల్లికార్జునరావు వినుకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతుల బంధువులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రశాంతంగా ఉండే వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. బైక్‌ను ఢీకొట్టిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ప్రమాదం కాదని, హత్యని పేర్కొంటూ గుంటూరు-కర్నూలు హైవేపై ఆ గ్రామస్తులు బైఠాయించారు. సమాచారం అందుకున్న నరసరావుపేట డిఎస్‌పి నాగేశ్వరరావు, వినుకొండ పట్టణ, రూరల్ సిఐలు టివి శ్రీనివాసరావు, కోటేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. వాహనాలు నిలిచిపోయాయని, రాస్తారోకో విరమించాలని ఆందోళనకారులకి చెప్పినా వారు అంగీకరించకపోవడంతో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును పిలిపించారు. ఎమ్మెల్యే సర్దిచెప్పడంతో రెండు గంటలానంతరం ఆందోళన ముగిసింది. అప్పటికే పెద్దఎత్తున నిలిచిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు. అయితే ఇప్పుడు హత్య చేసినట్టు భావిస్తున్న వైసీపీ నేతల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకపక్క సీఎం కావాలనే ఏకైక లస్ఖ్యంతో వైసీపీ అధినేత జగన్ హామీల మీద హామీలు ఇస్తూ పోతుంటే ఆయన పార్టీ నేతలు ఇలా హత్యా రాజకీయాలు మొదలుపెట్టారు.