తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పలువురు సీనియర్ నేతలు ఓడిపోయారు. పక్కా గెలుస్తాం అనుకున్న నేతలు కూడా ఫలితాలు చూసి అవాక్కయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహామహులు ఓడిపోయారు. వీరు ఓడిపోతారని ఎవరూ ఊహించి ఉండరు. అయితే ఈ పరిణామం కాంగ్రెస్ లోనే కాదు టీఆర్ఎస్ లో కూడా చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కి ఒకరిద్దరు సీనియర్ నేతలు అనూహ్యంగా ఓడిపోయారు. వారిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ తీరా ఫలితాలు చుస్తే తుమ్మల గెలవలేక పోయారు.
అయితే తాజాగా తన ఓటమిపై తుమ్మల స్పందించారు. తన ఓటమికి కారణం కొందరు టీఆర్ఎస్ నేతలేని పేర్కొని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ పరిధిలో గెలుపొందిన టీఆర్ఎస్ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లతో తుమ్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఓడించి కొందరు ప్రస్తుతం తాత్కాలిక ఆనందం పొందుతున్నారని సొంత పార్టీకి చెందిన నాయకులే కుట్రలు పన్ని తనను ఓడించారని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. పాలేరు నియోజకర్గానికి చెందిన కొందరు టీఆర్ఎస్ నాయకులు తనను ఓడించడమే లక్ష్యంగా పనిచేశారని వారు నన్ను కాదు రాజకీయ జీవితాన్ని అందించిన కన్నతల్లి లాంటి పార్టీకి మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. ఇలా మోసాలు, కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు చేస్తూ పార్టీకి మోసం చేసే వారు ఎక్కువకాలం రాజకీయాల్లో వుండలేరని తుమ్మల విమర్శించారు.