శ్రీవారికి నైవేద్యం మెనూ మీ కోసం…

tirumala sacred foods of Lord Venkateswara Swamy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి… చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి… 

  • వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా ? 
  • ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా ? 
  • ఇవి మాత్రమే కాదు… ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం! 
  • స్వామి వారికి సకల విధమైన నైవేద్యం గురించి ఎంతమందికి తెలుసు. 
  • సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. 
  • అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. 
  • ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు. 
  • ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక… 
  • శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు.

Lord-Venkateswara

*నేవైద్యం పెట్టేది ఇలా…*

  • ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. 
  • గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు. 
  • స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు. 
  • విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. 
  • కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ అన్నసూక్తం నిర్వర్తిస్తారు. 
  • చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే. 
  • ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు.
  • నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు. 
  • రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. 
  • ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. 
  • పది, పదకొండు గంటల మధ్య రాజభోగం, రాత్రి ఏడు – ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు. 
  • తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు. 
  • నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. 
  • ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.

Tirumala-temple

*ఉదయం బాలభోగం*

  • మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి
  • *మధ్యాహ్నం రాజభోగం*
  • శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం
  • *రాత్రి శయనభోగం*
  • మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం(వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)
  • *అల్పాహారాలు* 
  • లడ్డు, వడ, అప్పం, దోసె.. స్వామి మెనూ ఇదీ…
  • ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలు సమర్పిస్తారు. 
  • తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు. 
  • ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది. 
  • అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది. 
  • సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి… స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. 
  • అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు! 
  • అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు. 
  • ఇక పవళించే సమయం దగ్గరపడుతుంది. 
  • ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేంచిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు. 
  • క్లుప్తంగా ఇది శ్రీవారి మెనూ.
  •  ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః