Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హాస్యనటుడు గుండు హనుమంతురావుకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో అనుబంధం తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తనను ఎంతో ఆప్యాయంగా బావా అని పిలిచే గుండు హనుమంతురావు ఇక లేరంటే నమ్మలేకున్నానని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం బోరున విలపించారు. హనుమంతురావుతో తనకున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన అహ నా పెళ్లంట సినిమా తామిద్దరికీ మంచి గుర్తింపు తెచ్చిందని తెలిపారు. ఇండస్ట్రీలో తనకున్న అతికొద్దిమంది మిత్రుల్లో గుండు హనుమంతురావు ఒకరని, మూడు వారాల క్రితం తన ఇంటికి వచ్చిన హనుమంతు ఇప్పుడు మన మధ్య లేరంటే బాధగా ఉందన్నారు. తన నటనతో లక్షలాదిమందిలో నవ్వులు పూయించిన ధన్యజీవి ఆయనని, తనకు ఎదురైన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడని చెప్పారు. గుండు హనుమంతురావు మృతదేహం వద్ద బ్రహ్మానందం చాలా సేపు మౌనంగా నిలబడిపోయారు.
గుండు హనుమంతురావు మంచి ఆర్టిస్ట్, మంచివ్యక్తని, ఏ సన్నివేశం ఇచ్చినా కామెడీకి కామెడీ, సెంటిమెంట్ కు సెంటిమెంట్ పండించేవారని, ఆయన ఒక రేంజ్ కు ఎదుగుతారని అనుకున్నానని, అలా కాకపోవడం నిజంగా దురదృష్టమని ప్రముఖ దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రాజేంద్రుడు, గజేంద్రుడు సినిమాలో గుండు పాత్రను ఆయన కోసమే రాశానన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో కామెడీ పాత్రలతో గుండు హనుమంతురావు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. హనుమంతురావు, బ్రహ్మానందం, తాను ఒకేసారి చిత్రపరిశ్రమలోకి వచ్చామని, 30 ఏళ్ల పరిచయం తమదని శివాజీరాజా గుర్తుచేసుకున్నారు. అమృతం సీరియల్ తో తామిద్దరికీ మంచి పేరు వచ్చిందని, ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా తనను పిలిచేవారని, తన పరిచయంలో హనుమంతురావు ఎవరి ఇంటికైనా ఖాళీచేతులతో వెళ్లడం చూడలేదని తెలిపారు. గుండు హనుమంతురావు భార్య, కూతురు చనిపోయారని, అలాంటి కష్టాలను తట్టుకుని ఆయన ధైర్యంగా నిలబడ్డారని, కానీ ఆయన ఇంత త్వరగా మరణిస్తారని అనుకోలేదని శివాజీరాజా ఆవేదన చెందారు.