Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియాలో బాలీవుడ్ తర్వాత అతి పెద్ద మార్కెట్ ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. తెలుగు సినిమాలు ఎన్నో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాయి. అలాంటి తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా నెలకొన్న పరిస్థితులు సామాన్య సినీ ప్రేమికుడికి మరియు సినీ జనాలకు ఆవేదన కలిగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు అంటూ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంను లాగి రచ్చ చేస్తున్నారు. చిన్న స్టార్స్ నుండి పెద్ద స్టార్స్ వరకు అంతా కూడా కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడుతున్నట్లుగా ఈ మద్య పలువురు హీరోయిన్స్ ఆరోపించారు. శ్రీరెడ్డి మొదలు పెట్టిన ఈ వివాదం రోజు రోజుకు పెరిగి టాలీవుడ్‌ను నాశనం చేసే దిశగా సాగుతుంది.
సోషల్ మీడియా, వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇలా అన్ని మీడియాల్లో కూడా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులపై ఆరోపణలు వస్తున్నాయి. అందులో కొందరు మంచి వారు కూడా ఉన్నారు. సినిమా వారు అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ పరువు పోతుందని, ఇకనైనా ఈ వివాదానికి తెర పడాలని సామాన్యులు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఒక సామాన్య కుటుంబం నుండి అమ్మాయి సినిమా పరిశ్రమలోకి రావాలి అంటే భయపడే విధంగా పరిస్థితి ఉంది. అమ్మాయిల రక్షణ కోసం సినిమా పరిశ్రమకు చెందిన సభ్యులతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటి ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాతారు. అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఈ వివాదం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు మోసపోయిన వారు ఆ కమిటీకి రహస్యంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి న్యాయం చేసే అవకాశం ఉంది. కాని మీడియాకు ఎక్కి ఇలా ఆరోపణలు చేస్తే ప్రయోజనం ఏంటి? ఇకనైనా టాలీవుడ్ పరువు తీయకుండా ఏదైనా వ్యవహారం ఉంటే రహస్యంగా చక్కబెట్టుకోవాలని ప్రముఖులు సలహా ఇస్తున్నారు.