టీవీ 9 సర్వే ఆయనకి కౌంటర్…?

TPCC chief Uttam Kumar Reddy On Telangana Elections 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి ఇంకా వారం కూడా లేకముందు టీవీ 9 లో సీపీఎస్ సంస్థ చేసిన సర్వే వివరాలు వెల్లడి కావడం సంచలనానికి దారి తీసింది. ఈ సర్వే ఫలితాలు కూడా ప్రజాకూటమికి షాక్ ఇచ్చాయి. ఒకప్పుడు 100 సీట్లు గెలుస్తామని చెప్పిన తెరాస సైతం కాంగ్రెస్ , టీడీపీ జట్టు కట్టాక పరిస్థితులతో డిఫెన్స్ లో పడింది. సెంచరీ చేయకున్నా కనీసం హాఫ్ సెంచరీ చేస్తే ఎంఐఎం సహా ఇంకొందరి సాయంతో ప్రభుత్వ ఏర్పాటు చేయొచ్చని భావిస్తోంది. ఈ సమయంలో టీవీ 9 లో సీపీఎస్ సర్వే లో తెరాస కి 94 నుంచి 104 స్థానాలు వస్తాయని ప్రకటించడం చర్చకు దారి తీస్తోంది. అయితే ఈ సర్వే ఇప్పుడే ప్రకటించడాన్ని పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీని వెనుక టీవీ 9 మీద కెసిఆర్ ఒత్తిడి ఉందని కూడా ఆయన ఆరోపించారు. ఓ దశలో ఆయన టీవీ 9 మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సర్వే ప్రకంపనల వెనుక ఇంకో స్టోరీ కూడా ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న మాట.

UTTAM-KUMARREDDY-KCR
ఇటీవల ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుపడ్డ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్రులు ఎక్కువమంది గెలిచే అవకాశం ఉందని చెప్పిన ఆయన రెండు స్థానాల మీద తమ సర్వే ఫలితం చెప్పారు. మహబాబ్ నగర్ జిల్లా నారాయణ్ పేట్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి , కాంగ్రెస్ రెబెల్ శివ కుమార్ రెడ్డి , ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి అనిల్ కుమార్ గెలుస్తారని ప్రకటించారు. దాదాపు 10 మంది స్వతంత్రులు ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని కూడా తేల్చారు. అయితే లగడపాటి ఫలితాల ఆధారంగా 1994 , 2004 ఎన్నికల ఫలితాల్ని విశ్లేషిస్తూ అధికార పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత వున్నప్పుడే ఇలా జరుగుతుందన్న కధనాలు సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చాయి. ఈ పరిణామం తెరాస కి ఇబ్బందిగా మారింది. అందుకే కెసిఆర్ సైతం దిక్కుమాలిన సర్వే అంటూ పరోక్షంగా లగడపాటి మీద విసుక్కున్నారు, ఆ సర్వే కి , లగడపాటికి కౌంటర్ గానే ఇప్పుడు సీపీఎస్ సర్వే బయటకు వచ్చిందని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఇక టీవీ 9 మీద ఉత్తమ్ ఆగ్రహం మాట ఎలా వున్నా డిసెంబర్ 11 న వచ్చే ఫలితాల మీదే మిగిలిన పరిణామాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికైతే అన్నీ అంచనాలు , ప్రయత్నాలే అని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకున్నట్టే అనిపిస్తోంది.

tv9-servy