Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నల్గొండ జిల్లాలో ఘోరం జరిగింది. పీఏ పల్లి మండలం వద్దిపట్ల వద్ద ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్ కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. పదిమంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మంది ఉన్నారు. కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. కూలీలంతా వద్దిపట్లలోని పడమటి తండా నుంచి పులిచర్ల సరిహద్దుల్లోని మిరపచేనులో కూలీపనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుల హాహాకారాలు విన్న స్థానికులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. గల్లంతయిన వారికోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాలువలో ఉన్న ట్రాక్టర్ కింద మరికొన్ని మృతదేహాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. ప్రమాదం సంగతి తెలుసుకున్న కూలీల కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. మరణించిన తమవారిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ ట్రాక్టర్ నడిపిఉంటాడని, అలాగే నిద్రమత్తులో కూడా ఉన్నాడని అనుమానిస్తున్నారు.