ఖాకీ అలా పిలిస్తే వంకలు తిరుగుతున్నారు.

traffic police behavior on normal peoples in andhra pradesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సార్… ఈ పిలుపు ఖాకీలకు సర్వసాధారణం. ఇదే పిలుపు ఖాకీల నోటి నుంచి వస్తుంటే ఏ పై అధికారి ముందో నిలుచున్నారని అర్ధం. కానీ అదే పిలుపు సామాన్య జనం కోసం ఖాకీల నోటి నుంచి వస్తుంటే మాత్రం ఆశ్చర్యం. ఇప్పుడు ఇలాంటి ఆశ్చర్యానుభూతులు ఆంధ్రప్రదేశ్ లో సర్వసాధారణం అవుతున్నాయి. ఏయ్, రేయ్ వంటి పిలుపుతో సామాన్యుడిని దబాయించడమే ఇన్నాళ్లుగా చూసిన జనాలు వారిని సార్ అని పిలుస్తుంటే జనం సిగ్గుతో మెలికలు తిరుగుతున్నారు. ఖాకీల్లో ఇంత మార్పు రావడానికి పెద్ద కారణమే వుంది.

టూ వీలర్ మీద జామ్ జామ్ అని వెళుతుంటే ఏ మూల నుంచో ఎదురుగా ఖాకీ ప్రత్యక్షం కావడం, ముందుగా బండి కీ లాక్కోవడం సర్వసాధారణం. ఆపై వాహనం సి బుక్, లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్సు, హెల్మెట్ ఇలా అన్ని చూసి అవి ఉంటేనే తాళం ఇచ్చేది. లేదంటే ఫైన్ లో, పైరవీలో తప్పవు. కానీ ఈ కొద్ది టైం లో పోలీసుల నోటి నుంచి ఏ మాట వస్తోందో అని బిక్కుబిక్కుమంటూ నుంచుంటాం. కానీ వైజాగ్ లో జరిగిన ఓ దుర్ఘటనతో ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు ఇప్పుడిప్పుడే ఫలితం ఇస్తున్నాయి. అక్కడ బైక్ మీద వెళ్తున్న దంపతుల్ని ఆపడానికి పోలీస్ చేసిన మొరటు ప్రయత్నం ఓ మహిళని బలితీసుకుంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు ముందుగా కిందిస్థాయి సిబ్బంది వ్యవహారశైలిలో మార్పు రావాలని ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జనంతో మర్యాదగా మసులుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

దీంతో ఎంత మార్పు వచ్చిందంటే… అనంతపురం లో హెల్మెట్ లేకుండా బైక్ మీద వెళ్తుంటే ఖాకీలు వారిని సార్ అని పిలిచి మరీ ఆపుతున్నారు. తాగడానికి మంచి నీళ్లు ఇచ్చి హెల్మెట్ లేకపోతే జరిగే నష్టాన్ని వివరిస్తున్నారు. ఇక కర్నూల్ లో రాత్రి పూట తనిఖీలు చేసేటప్పుడు వాహనదారులకు ఖాకీలు టీ ఆఫర్ చేస్తున్నారు. ఇక విజయవాడ లో అయితే ఏకంగా గిఫ్ట్స్ ఇచ్చి మరీ చేస్తున్న తప్పు గుర్తు చేస్తున్నారు. పోలీసులే ఇలా సార్ అని పిలిచి మరీ హెల్మెట్ గురించి చెబుతుంటే వాహనదారులు సిగ్గుతో వంకర్లు తిరుగుతున్నారు. అప్పటికప్పుడే హెల్మెట్ షాప్ కి వెళుతున్నారు. అయితే ఈ ఖాకీల మర్యాదకు కూడా ఓ షరతు వుంది. అదేమిటంటే తాగి బండి నడపడం, రాష్ డ్రైవింగ్ తో ఎదుటి వాళ్ళకి ముప్పు తెచ్చే పనులు చేస్తే మాత్రం ఖాకీలు చేసే మర్యాదలు వేరుగా ఉంటున్నాయి..