రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేయడమే పనిగా పెట్టుకొని, ఒత్తిడి ని తట్టుకోలేక అస్వస్థతకు గురవుతున్నారు. ఒకవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి గడువు సమీపిస్తుండడంతో ఉన్న సమయంలోనే ఖాళీ సమయం గురించి కూడా ఆలోచించకుండా ప్రచారానికి వెళ్తుండడం, మరోవైపు పార్టీలోని అంతర్గత కలహాలు ఆందోళనకి కారణమవుతుండడం వలన ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యి అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా ఈ పరిస్థితి తెరాస పార్టీ నుండి ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన ముఠా గోపాల్ కి ఎదురయ్యింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో తెరాస పార్టీ నుండి టికెట్ ఆశించి, భంగపడిన ప్రఫుల్ రాంరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తుండడంతో, ప్రఫుల్ రాంరెడ్డి ని పోటీనుండి తప్పించే విషయమై చర్చించడానికి ప్రగతిభవన్లో కేటీఆర్ ని కలిసేందుకు నిన్న గురువారం మధ్యాహ్నం వెళ్లారు.
భోజనం చేసిన తరువాత మాట్లాడుకుందాం అని కేటీఆర్ చెప్పడంతో, ఫ్రెష్ అయ్యేందుకు వాష్ రూమ్ కి వెళ్లిన ముఠా గోపాల్ తిరిగి బయటకు రాకపోవడంతో, వెంట వచ్చిన పుట్టాం పురుషోత్తమ్ వాష్ రూమ్ కి వెళ్లగా ముఠా గోపాల్ క్రిందపడిపోయి ఉండడంతో, అక్కడున్న కార్యకర్తల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. కొంతసేపటికి ముఠా గోపాల్ స్పృహలోకి రావడంతో, గాంధీనగర్ లోని యశోద హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. ముషీరాబాద్ నుండి ఎమ్మెల్యే సీట్ ని ఆశించిన తెరాస నాయకుడు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వకూడా హాస్పిటల్ కి వెళ్లి ముఠా గోపాల్ ని పరామర్శించారు. ముఠా గోపాల్ మాత్రమే కాకుండా ముషీరాబాద్ ప్రజకూటమి అభ్యర్థి ఎం. అనిల్ కుమార్ యాదవ్ మరియు అంబర్ పెట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి లు జ్వరంతో బాధపడుతూనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దానం నాగేందర్ కూడా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ కూడా వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రెండు రోజులనుండి ఇంట్లోనే ఉన్నారు.