తన ప్రియురాలిని వెంటేసుకుని తిరుగుతున్నాడని ఆరోపిస్తూ, టీఆర్ఎస్ స్థానిక నేతపై కొడవలితో దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గంగదేవిపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు గోనె మల్లయ్య అలియాస్ మల్లారెడ్డి గ్యాస్ సేఫ్టీ డివైజ్ లను విక్రయించే ఏంజంట్ గా కూడా పనిచేస్తున్నాడు. ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న వితంతువైన ఓ మహిళా అటెండర్ ఏజెంట్ గా పని చేస్తుంటుంది.
ఈ క్రమంలో మల్లారెడ్డి, మహిళా అటెండర్, మరో ఇద్దరు కలిసి శనివారం నాడు ఓ కారులో కంపెనీ పనిపై వెళుతున్న వేళ, ఊకల్ క్రాస్ రోడ్డులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటున్న బోయరాజు అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఆమెను ఎక్కడికి తీసుకువెళుతున్నావని గొడవకు దిగాడు. దీనిని అవమానంగా భావించిన ఆమె అదే రోజు రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా, విషయం తెలుసుకున్న మల్లారెడ్డి, ఆమెను ఆసుపత్రిలో చేర్చాడు. ఆపై ఆమె కోలుకోవడంతో నిన్న తెల్లవారుజామున ఇంటివద్ద దింపి వెళ్లాడు. నిన్న ఉదయం ఇంటికి వచ్చిన బోయరాజు, ఆమెతో గొడవపడి, మల్లారెడ్డితో ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తూ, చంపుతానని బెదిరించాడు.
ఆ తర్వాత మల్లారెడ్డి వద్దకు వెళ్లి, వింతంతువైన ఆమె, తాను ప్రేమించుకున్నామని, సహజీవనం చేస్తున్నామని చెబుతూ, తామిద్దరమూ కలిసున్న ఫొటోలు చూపిస్తూ, మరోసారి ఆమెతో తిరగవద్దని హెచ్చరించాడు. నిన్న సాయంత్రం, గ్రామంలోని ఆంధ్రా బ్యాంకు ఎదురుగా ఉన్న ఓ హోటల్ వద్ద మల్లారెడ్డి కూర్చుని ఉండగా, అక్కడికి వచ్చిన బోయరాజు, తన వెంట తెచ్చుకున్న కొడవలితో మల్లారెడ్డిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో మల్లారెడ్డికి స్వల్ప గాయాలు కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.