తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా అయిపోవడంతో పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాలతో వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు, అసంతృప్తుల బుజ్జగింపులతో బిజీ బిజీగా గడిపిన పార్టీలు.. ఇక ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నాయి. అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచే అంతా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. రాష్ట్రంలోని అన్ని పార్టీలకంటే కొంచెం ముందుందనే చెప్పాలి. మిగిలిన పార్టీలన్నింటితో పోలిస్తే మహాకూటమి కొంత వెనకుంది. పొత్తులు ఎప్పుడో ఖరారైనా సీట్ల సర్ధుబాటు మాత్రం ఆలస్యమవడంతో ఆయా పార్టీలలోని అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు తక్కువ సమయమే దొరికింది. దీనినే ఉపయోగించుకుని ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రసంగాలకు ప్రజల్లో క్రేజ్ ఉండడంతో ఆయనను కీలక నియోజకవర్గాల్లో పర్యటించేలా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పార్టీ ప్రత్యేక హెలీక్యాప్టర్‌ను సమకూర్చి రేవంత్ రెడ్డిని ప్రచారంలోకి దింపుతుందట. అయితే ఇటీవల టీఆర్ఎస్ నేత కేటీఆర్ కొడంగల్ లో ఆ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొని ‘ టీఆర్ఎస్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. కూటమి ఓడిపోతే నువ్వు రాజకీయాలను వదిలేస్తావా’ అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. అసలే టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడే రేవంత్ ఆయనపై సవాల్ చేస్తే ఊరుకుంటారా దీంతో ఇప్పుడు ఏకంగా సిరిసిల్లలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ కైవసం చేసుకోవాలి అనుకుంటుంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ సీటుకే ఎసరుపెట్టేలా ఉన్నారు.
కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థిగా న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కేకే మహేందర్ రెడ్డి తరుపున రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నరు. వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, చందుర్తి మండల కేంద్రాల్లో జరిగే బహిరంగ సభల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి రమేశ్‌బాబు ఎంపీ వినోద్ కుమార్‌కు సన్నిహిత బంధువు కావడం, వినోద్‌కుమార్ కేసీఆర్‌కు అన్ని విషయాల్లో అండదండగా ఉంటుండడంతో రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది.