Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా, ఉత్తరకొరియా మధ్య యుద్ధం తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరకొరియా సరిహద్దుకు అతిసమీపంలో యుద్దవిమానాలు మోహరించిన అమెరికా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చని ప్రపంచానికి సంకేతాలిస్తోంది. నిజానికి యుద్ధం చేయడమనేది అమెరికా ప్రభుత్వాలకు అలవాటే. ముఖ్యంగా రిపబ్లికన్లు శాంతి కన్నా యుద్ధానికే ప్రాధాన్యతనిస్తారన్న టాక్ కూడా ఉంది. రిపబ్లికన్ పార్టీ నేతలైన సీనియర్, జూనియర్ బుష్ లిద్దరూ తమ హయాంలో యుద్ధం చేశారు. సీనియర్ బుష్ తర్వాత వచ్చిన డెమోక్రటిక్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గానీ…జూనియర్ బుష్ తర్వాత వైట్ హౌస్ లో అడుగుపెట్టిన డెమోక్రటిక్ నేత ఒబామా గానీ పూర్తికాలం అధికారంలో ఉన్నా ఎప్పుడూ యుద్ధం జోలికి వెళ్లలేదు. ఇప్పుడు రిపబ్లికన్ నేతగా శ్వేతసౌధాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్ మాత్రం తమ పార్టీ వారసత్వాన్ని కొనసాగిస్తూ యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్నారు.
వరుస క్షిపణి దాడులతో తమ దేశాన్ని రెచ్చగొడుతునన ఉత్తరకొరియాను చర్చలతో కాకుండా యుద్ధంతో దారికి తేవాలన్నది ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఉత్తరకొరియాపై సైనిక చర్య చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని ఆయన ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్ తో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తీవ్రమైన చెడు ప్రవర్తనను చూపిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేనంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అత్యంత సులువుగా సమస్యను పరిష్కరించుకునే వీలున్నా…ఉత్తరకొరియా ఆ దిశగా ప్రయత్నించడం లేదని ఆయన మండిపడ్డారు. ఆ దేశంపై సైనిక చర్యకు సిద్ధంగా ఉన్నామని, అదే జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. సైనిక చర్య అన్న పదం తమ తొలి ఆప్షన్ కాదన్న ట్రంప్…రెండో ఆప్షన్ గానే దాన్ని ఎంచుకున్నామని చెప్పుకొచ్చారు.
ఒక వేళ అమెరికా రంగంలోకి దిగితే…పూర్తి విజయం సాధించేవరకు వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. అయితే ఇది తన అసలు స్టేట్ మెంట్ కాదని, మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని రెండో ఆప్షన్ గానే ఎంచుకున్నామని ట్రంప్ చెబుతున్నప్పటికీ అంతర్జాతీయ నిపుణులు మాత్రం ఆయన వాదనను కొట్టిపారేస్తున్నారు. ఉత్తరకొరియాను సర్వనాశనం చేస్తామని ఐక్యరాజ్యసమితి వేదికపై ట్రంప్ చేసిన ప్రసంగం చూస్తే…యుద్ధం చేయాలన్న తలంపుతోనే అమెరికా ఉన్నట్టు అర్ధమవుతోందని వారు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి ఆంక్షలు, అమెరికా యుద్ధం హెచ్చరికల తర్వాత కూడా ఉత్తరకొరియా వెనక్కి తగ్గటం లేదు. ఫసిఫిక్ మహాసముద్రంలో అతిపెద్ద అణుపరీక్ష నిర్వహించడానికి తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సన్నాహాలు చేస్తున్నారని ఉత్తరకొరియా విదేశాంగమంత్రి ప్రకటించడం అంతర్జాతీయంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది.