Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుస క్షిపణి ప్రయోగాలు చేస్తూ… దుందుడుకు వైఖరితో ఉత్తరకొరియా తమను రెచ్చగొడుతోందని ఆరోపిస్తోన్న అగ్రరాజ్యం అమెరికా… తాను కూడా తక్కువ కాదని నిరూపిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆచితూచి మాట్లాడాల్సిన బాధ్యత ఉన్న అగ్రరాజ్యం కిమ్ లాగానే నోటిదూకుడు ప్రదర్శిస్తోంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇటీవల ట్రంప్ తమ మిత్రదేశం, ఉత్తరకొరియా శత్రుదేశం అయిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జై ఇన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ గురించి మాట్లాడుతూ రాకెట్ మెన్ ఏం చేస్తున్నాడు…? సుదూరాల నుంచి గ్యాస్ పైప్ లైన్ నిర్మిస్తున్నాడా…? ఏం బాగోలేదు అని వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా వెల్లడించాడు.
అమెరికా ఇంతటితో ఆగలేదు. తన తీరు మార్చుకోవాలని ట్రంప్ సలహాదారులు ఉత్తరకొరియాకు హెచ్చరికలు జారీచేశారు. అటు భద్రతామండలి ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధించేలా పావులు కదిపిన అమెరికా… దీనిపై స్పందించింది. ఆంక్షల తీవ్రత ఏమిటో ఉత్తరకొరియాకు ఇప్పుడు తెలిసి వస్తోందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. ఈ ఆంక్షలతో ఉత్తరకొరియాకు ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయాయని, దౌత్య, సైనికేతర పరిష్కార మార్గాలు దూరమైపోతున్నాయని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. ఉత్తరకొరియా ఇదే వైఖరి కొనసాగిస్తే… అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు మిత్రదేశాలనూ రక్షిస్తుందని, ఈ క్రమంలో ఉత్తరకొరియా ధ్వంసమైపోవచ్చని ఆమె హెచ్చరించారు. అమెరికాకు అన్ని మార్గాలూ తెలుసని, తమ దేశంలో ఎవరూ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ యుద్ధం చేయాల్సిన పరస్థితి వస్తోందని నిక్కీ హేలీ అన్నారు.