టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం

TTD Chairman YV Subbara Reddy sensational decision

పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం జగన్‌ రాజకీయవర్గాల్లో చర్చలకు తెర లేపుతున్నారు. తాజాగా ఆయన బాబాయ్ ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం జగన్ దారిలోనే నడుస్తున్నారు. టీటీడీలో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న ప్రొటోకాల్ దర్శనంతో పాటు ఎల్1, ఎల్2, ఎల్3లుగా ఉన్న వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలనే సంచలన నిర్ణయాన్ని త్వరలో అనౌన్స్‌ చేయనున్నారట వైవీ సుబ్బారెడ్డి . టీటీడీ పాలకమండలి కొలువుదీరిన తర్వాత తొలి సమావేశంలోనే తన నిర్ణయాన్ని వెలువరించనున్నారని వైసీపీ వర్గాల సమాచారం. టీటీడీలో వీఐపీ దర్శనాలపై ఎప్పటినుంచో విమర్శలు వస్తున్నాయి. సామాన్య భక్తులకు ఇబ్బందిగా మారిన వీఐపీ దర్శనాలను రద్దుచేయాలని పలుమార్లు డిమాండ్ వచ్చినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం బ్రేక్‌ దర్శనం టికెట్లు మూడు కేటగిరీల్లో విభజించి కేటాయిస్తున్నారు. అత్యంత ప్రముఖులకు లిస్టు-1గా, ఇతరులకు స్థాయిని బట్టి లిస్టు-2గా టికెట్లు మంజూరు చేస్తున్నారు. సాధారణ సిఫార్సులను లిస్టు-3 కింద పరిగణిస్తున్నారు. అన్ని కేటగిరీలకు సిఫార్సు తప్పనిసరి కావడంతో 500 కట్టాల్సిందే. లిస్టు-1 కింద టికెట్లు పొందిన భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఒత్తిడి లేకుండా నిదానంగా స్వామివారి దర్శనం చేయించడంతో పాటు తీర్థం, శఠారీ మర్యాదలు కల్పిస్తారు. వీరి తర్వాత లిస్టు-2 టికెట్లున్న వారిని ఆలయానికి అనుమతిస్తారు. వీరిని గర్భగుడి ముందు ద్వారమైన కులశేఖరపడి వరకు అనుమతిస్తారు.అయితే.. స్వామివారిని దర్శించుకుంటూ వేగంగా ముందుకు కదలాల్సి ఉంటుంది. క్షణకాలమూ నిలబడటానికి అనుమతించరు. అనంతరం లిస్టు-3 బ్రేక్‌ దర్శనం టికెట్లు కలిగిన భక్తులను పంపించి మరింత వేగంగా కదిలేలా కూలైన్లను పర్యవేక్షిస్తారు.