తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రిక-లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీం నిర్వహించిన సర్వేలో టీడీపీకి 110 సీట్లు వస్తాయని మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తాడని తేల్చిన సంగతి తెలిసిందే. అయితే అదంతా పూర్తి అబద్ధమని.. ఆ సర్వేకు పూర్తి విరుద్ధంగా ఫలితాలు వస్తాయని ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేసారు. పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లిన జగన్ కు ప్రజల్లో అపూర్వ స్పందన వస్తోందని.. దీన్ని బట్టి అతడి వైసీపీ విజయం ఖాయమని ఉండవల్లి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ స్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉందని అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని ఆయన అన్నారు.
చంద్రబాబుకు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ తెలుసని అందుకే జగన్‌కు సరైన ఎన్నికల టీమ్ అవసరం అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం విషయంలో అంత త్వరగా అంచనాకు రావడానికి వీల్లేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీల రెండింటి హస్తం ఉందని, హోదా సాధించితీరాలని అన్నారు. అయితే అది వేడి మీద ఉన్నప్పుడే జరగాల్సిందని అన్నారు. రానున్న లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు ఉండవల్లి. కేంద్రంతో పోరాడాలని తను ముందు నుంచినే చెబుతున్నాను అని, అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పోరాడుతున్నట్టుగా యాక్షన్ మాత్రమే చేస్తున్నారని ఉండవల్లి పేర్కొన్నారు. అయితే వైకాపా చీఫ్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిపోతే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమన్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమనేది చెప్పలేమని అన్నారు