కరోనా ప్రస్తుతం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నాలుగు నెలల పాటు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించుకొని ఇంటికే పరిమితమైనప్పటికీ.. కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గ లేదు సరికదా ఇంకా దాని తీవ్రత చూపుతూనే ఉంది. అయితే పంచదేశాలన్నీ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకే ఉపకరించే వ్యాక్సిన్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని ఔషధాలు కరోనా చికిత్సలో సమర్థవంతంగా పనిచేస్తూ ఊరటను కలిగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్ ఫార్మా భారత మార్కెట్లో సరికొత్త కరోనా ఔషధాన్ని రిలీజ్ చేసింది. ఇది నోటి ద్వారా తీసుకునే యాంటీ వైరల్ డ్రగ్. ‘ఫావిపిరావిర్’ అనే ఈ మందును ‘ఫాబిఫ్లూ’ పేరుతో విక్రయించనున్నారు. ‘ఫాబిఫ్లూ’ మాత్రలను కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు కేంద్రం అనుమతులు తెలిపింది. అయితే ఈ ఔషధం పనితీరును అంచనా వేసిన భారత ఔషధ నియంత్రణ సంస్థ బాధ్యతాయుతమైన ఔషద వినియోగానికి ఆమోద ముద్ర వేసిందని తెలిపింది.