ఒకపక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, మరో పక్క మళ్ళీ అధికారం చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేయింబవళ్ళూ కష్టపడుతూ ఉంటె ఆ పార్టీ నేతలు మాత్రం పంతాలకు పోయి పార్టీ పరువును రోడ్దేక్కిస్తున్నారు. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. వరదరాజులు రెడ్డి వర్సెస్ ఎంపీ రమేష్ సీఎం మధ్య మళ్లీ కోల్డ్ వార్ మొదలయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్నందున నేతలంతా సర్థుకుపోయి సమన్వయంతో ముందుకెళ్లమని అధినేత చెప్పినా వరదరాజులు రెడ్డి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్ల రాజీనామా వ్యవహారంతో మళ్లీ వేడి రాజుకోగా సీఎం రమేష్‌ను టార్గెట్ చేస్తూ వరదరాజులు మళ్లీ ఫైరయ్యారు.
ఇక నియోజకవర్గంలో ఎంపీని అడుగు పెట్టనిచ్చేది లేదంటూ విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తుంటే అడ్డు తగులుతున్నారని వరదరాజులు రెడ్డి అన్నారు. ఎంపీ సీఎం రమేశ్ తెర వెనుక రాజకీయాలు నడిపిస్తున్నారని,మైనార్టీ వార్డులకు సంబంధించిన సమావేశం పెడితే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం తప్పా అని నిలదీశారు. తనకు ప్రాణం ఉన్నంత వరకూ సీఎం రమేష్‌ను రానివ్వనన్నారు.