Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సావిత్రి తెలుగు తెరపై, ముఖ్యంగా దక్షిణాది సినీ రంగంలో చెరగని ముద్రవేసింది ఆమె. నటన పరంగా సావిత్రి ఎన్ని ఉన్నత శిఖరాలు అధిగమించిందో… వ్యక్తిగత జీవితంలో అన్ని కష్టాలు అనుభవించింది అని చెబుతుంటారు ఆమె సన్నిహితులు. సావిత్ర జీవితంలో ప్రేక్షకులకు తెలియని ఎన్నో కోణాలు త్వరలో ఆమె బయోపిక్ ద్వారా రేపు బయటకు రాబోతున్నాయి. అయితే కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగా 1954 జూలై “కినిమా” పత్రికలో కొమ్మారెడ్డి సావిత్రి పాఠకుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ప్రచురించబడ్డాయి. అందులో మొదటి భాగం మీకోసం
ప్రః మీరిప్పుడు నటిస్తున్న చిత్రాలేమిటి ?
జ) నేనిప్పుడు నటిస్తున్న చిత్రాలుః జనాతావారి “పరివర్తన”; జంపన & నందివారి “మేనరికం” (తెలుగు) “కుడుంబం” (అరవం) జెమినీ వారి “ బహుత్ దిన్ హుయే” (హిందీ); విజయవారి ‘మిస్సమ్మ’ (తెలుగు), “మిస్సియమ్మ” (తమిళం);మోడరన్ థియేటర్స్ వారి 66 వ చిత్రం (తమిళం); వినోదా “కన్యాశుల్కం”, ఏ వి ఎమ్ వారి “వదినె” (తెలుగు), “ చెళ్లపిళ్లై ” (తమిళం).
ప్రః కొందరు ప్రముఖ హిందీ తారలు ప్రకటించుకున్నట్లు మీకు కాబోయే భర్త ఎలాంటివాడుగా వుండాలో చెప్తారా?
జః నేనింతవరకూ ఊహించుకోలేదే
ప్రః దయచేసి మీరు త్వరగా ఒక ప్రొడ్యూసర్ అయి, మాలాంటి ఉత్సాహవంతులైన కళాభిమానులకు సినిమా రంగంలో తగిన ప్రోత్సాహం కలిగిస్తారనాశించవచ్చునా ?
జః ప్రొడ్యూసర్ కాదలచుకోలేదు
ప్రః ఇంతవరకు మీరు నటించిన చిత్రాలలో ఏ పాత్రకైనా న్యాయము చేకూర్చానని చెప్పగలరా?
జః చెప్పగలను.
ప్రః నేను మీకొక రిస్టువాచ్ బహుమతి ఇవ్వాలనుకొనుచున్నాను. అది మీకు చేరేవిధం ఏలాగ ?
జః పోస్టు విధంగా.
ప్రః జనతావారి “పరివర్తన” కథ, ఆత్రేయ — పరివర్తన నాటకం ఒకటేనా?
జః కాదు, దానికీ, దీనికి చాలా తేడా వుంటుంది.
ప్రః “పరివర్తన” లో హీరో ఎన్.టి రామారావా లేక నాగేశ్వరరావా?
జః రామారావు
ప్రః మీరు సినిమా రంగం చేరింది కేవలం ధనాపేక్ష కోసమా లేక కళోపాసనకా?
జః రెండింటి కోసం
ప్రః “పెంపుడు కొడుకు” డైరెక్టరు ప్రసాద్ గారిదని నేను, కాదని నా మిత్రుడు వాదించుకుంటున్నాము. మీరు ఎవరితో ఏకీభవిస్తారు?
జః “పెంపుడు కొడుకు” చిత్రం ప్రసాద్ గారిది కాదు ఆయన ఆ చిత్రానికి దర్శకుడు మాత్రమే.
ప్రః కె.వి చౌదరికిని, కె. వి రెడ్డికిని ఏమైనా సంబంధము ఉందా?
జః సినిమాల వరకు వారు స్నేహితులు.
ప్రః మీరు ఏ సినిమాలోనైనా స్వంతముగా పాటలు పాడారా?
జః లేదు.
ప్రః బ్రతుకు తెరువు లో మీకు ఉన్న తలవెంట్రుకలు మీ తలవేనా లేక కంపెనీ తలా?
జః ఇంకా నయం మీ ముఖమేనా, లేక కంపేనీ ముఖమా అని అడిగారు కాదు.
ప్రః నేను కినిమా కు 15 నెలలనుండి ప్రశ్నలు పంపుతున్నాను. కాని, నన్ను నిరుత్సాహపరచి ఎవ్వరూ కూడా సమాధానాలివ్వడం లేదు. దయయించి దీనికైనా సమాధానాలిస్తారా?
జః 15 నెలలనుండి కినిమాకు పంపిన ప్రశ్నలు ఇలాంటివేనా సోదరా?
ప్ర.నన్ను మరచిపోయావా సిస్టర్?
జః మరచిపోలేదు బ్రదర్.
ప్రః మీ అక్క మారుతి, మీ నాన్నగారి మొదటి భార్య కుమారై అని నేను, కాదని నామనస్సు వాదించుకుంటున్నాము. ఏది నిజము?
జః మీ మనస్సు చెప్పేదే నిజం.
ప్రః సోదరీ నీ యొక్క వివాహమునకు నేను రావచ్చునా?
జః తప్పకుండా….
ప్రః నాకు కబురు పంపెదవా?
జః జ్ఞాపకముంటే…
ప్రః మీరేదో హిందీ చిత్రాలలో నటిస్తున్నారని విన్నాను. నిజమేనా సోదరీ?
జః నిజమే.
ప్రః నిజమే అయితే మీకు హిందీవచ్చా?
జః ఓ.
ప్రః పార్వతి పాత్రవల్ల మీరు తెలుసుకున్న విషయాలేమైనా ఉన్నవా?
జః అటువంటి పాత్రలు నటించటమంటే పెద్ద పరీక్షలకు కూర్చున్నంత పని ఔతుందని…
ప్ర. “దేవదాసు” లో పార్వతి చనిపోయిందీ లేనదీ కచ్చితంగా తెలుపలేదు. అసలింతకూ పార్వతి చనిపోయిందా లేదా?
జః “దేవదాసు” చనిపోయిన తరువాత పార్వతి వున్నా ఒకటే లేకపోయినా ఒకటే.
గమనిక : 1954 జూలై “కినిమా” పత్రికలో కొమ్మారెడ్డి సావిత్రి పాఠకుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ప్రచురింపబడింది. ఆ పత్రికలో ప్రచురించిన ప్రశ్నలు-జవాబులు యధాతధంగా మీకు ఇవ్వటం జరిగింది. ఈ ప్రశ్నలు జవాబులు అన్నీ మాహనటిసావిత్రి.కాం నుండి తీసుకుని పాటకుల సౌలభ్యం కోసం ఇవ్వబడ్డాయి. కొన్ని ప్రశ్నలకు సావిత్రి ఇచ్చిన జవాబులు చూస్తే ఎంత తమాషాగా, తెలివిగా ఆమె మాట్లాడేదో అర్దమవుతుంది. మాహనటి సినిమా విడుదల సందర్భంగా ఆమె అభిమానులకి ఇవ్వగలిగే చిరు కానుక ఈ ఇంటర్వ్యు.
ఆమె పాటకులకి ఇచ్చిన సమాధానల లిస్టు పెద్దదిగా ఉండడంతో మేము రెండు భాగాలుగా ప్రచురిస్తున్నాము గమనించగలరు.
Content Credits : http://www.mahanatisavitri.com/newposts/kinemainterview/