Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల తరువాత రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని ఉపరాష్ట్రపతిగా ఎన్నికయిన వెంకయ్య నాయుడు చెప్పటంతో ఆయన వారసులు వెంకయ్య స్థానంలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై వెంకయ్య నాయుడు స్పందించారు. రాజకీయాల్లో తనకు వారసులు ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. తన భార్య ఉషకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఆమె లో ప్రొఫైల్ లో ఉంటారని వెంకయ్య చెప్పారు. కుమారుడు ఆటోమొబైల్స్ వ్యాపారం చేస్తున్నారని, కుమార్తె స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారని..వారిద్దరిలో ఎవరికీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలేదని వెంకయ్య తెలిపారు.
రాజకీయాల్లో తాను ఉన్నత పదవుల్లో ఉన్నా..తన పేరును ఉపయోగించుకుని లబ్ది పొందేందుకు తన కుటుంబ సభ్యులెవరూ ప్రయత్నించలేదని, వారు తమ వ్యాపారాల్లో, కార్యక్రమాల్లో సొంతంగానే ఎదిగారని ఆయన కితాబిచ్చారు. తాను రాజకీయాల నుంచి వైదొలిగినా…కుమార్తె కానీ, కుమారుడు కానీ తన స్థానంలోకి రారని, వారసత్వ రాజకీయాలను తాన ప్రోత్సహించబోనని వెంకయ్య స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావటం బాధ కలిగించినా…2019 తర్వాత తాను ఎలాగూ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నానని, ఇప్పుడు అది రెండేళ్లు ముందుకు జరిగిందని చెప్పారు. మోడీని మరోసారి ప్రధానిగా చూసి తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని వెంకయ్య అన్నారు. 1999 నుంచి 2004 మధ్య వాజ్ పేయి హయాంలోనూ, 2014 నుంచి మోడీ హయాంలోనూ వెంకయ్య కేంద్రంలో అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు సహా పార్టీలో అనేక కీలక పదవులు చేపట్టారు. జన్ సంఘ్ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించిన వెంకయ్య నాయుడు బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు.
ఒక దశలో 42 ఏళ్ల చిన్న వయసులోనే ఆయనకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం వచ్చిందట. అయితే కుమార్తె దీప సలహా మేరకు ఆ పదవిని స్వీకరించేందుకు నిరాకరించానని వెంకయ్య చెప్పారు. అప్పుడు వద్దన్నా తర్వాత ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషిచేశారు.
మరిన్ని వార్తలు: