విజయ్ దేవరకొండ అనే హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, వివిధ సినిమా ఫంక్షన్లలలో తన ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఇస్తూ తాను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. అయితే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రౌడీ హీరో నిన్న సెన్సిటివ్‌గా మారిపోయాడు. తమ్ముడ్ని తలచుకుని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుని తనలోని కొత్త కోణాన్ని చూపించారు. చిన్నప్పటి నుండే నేను ఎక్కడికి వెళ్తే.. అక్కడికి మా తమ్ముడు ఆనంద్ దేవరకొండ వచ్చేస్తాడని.. తను సినిమాల్లోకి రావడం నాకు ఇష్టం లేదన్నారు విజయ్ దేవరకొండ. శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవకొండ హీరో హీరోయిన్లుగా నటించిన ‘దొరసాని’ మూవీ జూలై 12న విడుదల కానుండటంతో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. జీవిత, రాజశేఖర్ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను ఉద్దేశించి ఆసక్తికరమైన స్పీచ్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఆయన మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా చేస్తా.. అన్నప్పటినుండి వాడితో పెద్దగా మాట్లాడలేదు. ఈరోజు వీడితో మాట్లాడాలి. నేను పుట్టపర్తిలో హాస్టల్లో ఉండి చదువుకునే వాడిని. నాకు క్లాస్‌లు తొందరగా స్టార్ట్ అయ్యాయి. వీడు ఫస్ట్ క్లాస్ అయినప్పటికీ ఏడ్చుకుంటూ నా క్లాస్ రూం దగ్గరకు వచ్చేసేవాడు. అప్పటి నుండి వీడికి నేను ఎక్కడికి వెళ్తే అక్కడకు వచ్చేయడం వీడికి అలవాటు అయిపోయింది. వీడు యూఎస్ నుండి ఇండియా రావడం నాకు ఇష్టం లేదు. కష్టపడి ఇంజనీరింగ్ చేసి యూఎస్‌లో జాబ్ చేసి ఇండియాకి వచ్చేస్తా అంటే నాకు నచ్చలేదు. ఇప్పుడు ఎందుకురా? ఇండియా వచ్చేసి ఇక్కడ ఏం చేస్తావ్ రా? అని అడిగా? ‘నేను యాక్టింగ్ చేస్తా’ అని అన్నాడు? నేను షాకై.. యాక్టింగ్ అంటే ఆటలు కాదు.. ఎట్లా చేస్తావ్.. సడెన్ వచ్చి నటించేస్తా అంటే అంత ఈజీ కాదు అని చెప్పా. కాని మనోడు ఫిక్స్ అయ్యాడు గట్టిగా. నేను సరే అని.. నీ సినిమా నువ్ చేసుకో. నా దగ్గరకు నువ్ రాకు. నన్ను ఏం అడగకు. నేను ఎలాంటి సపోర్ట్ చేయను అని చెప్పేశా. అప్పటి నుండి ఇప్పటి వరకూ వాడి సినిమా గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే.. నీళ్లలో పడితే స్విమ్మింగ్ అయినా చేస్తారు.. లేదంటే మునిగిపోతారు. దెబ్బకి తేలిపోతారు. అంటే నేను ఎలాగైతే సినిమాని సెలెక్ట్ చేసుకున్నానో నువ్ చేసుకో.. ఒక కథను ఎంచుకున్న దగ్గర నుండి అది థియేటర్స్‌కి వెళ్లే వరకూ ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు తెలియాలి. అని వాడ్ని అలా వదిలేశాననియూఎస్కి వెళ్లి జాబ్ చేస్తూ.. ఇంటికి డబ్బు పంపించి హెల్ప్ చేశావ్. ఆ టైంలో నాకు హెల్ప్ చేశావు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ.