Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రలో అవిశ్వాసం అటకెక్కేసింది. ఇప్పుడు ఐఏఎస్‌ల వివాదం నడుస్తుంది. ఏదో ఒక టాపిక్ తీసుకుని టిడిపిని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అని వైసిపి ఎదురుచూస్తూ ఉంటుంది. ఈసారి ఫర్ ఎ చేంజ్ అనుకుందో ఏమో ప్రభుత్వాన్ని వదిలేసి ప్రభుత్వ అధికారులని టార్గెట్ చేసింది. ముగ్గురు ఐఏఎస్ లను ఒక ఐపీఎస్‌ను టార్గెట్ గా చేసుకుని వైసిపిలో నంబర్ 2గా మసిలే రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఆడియో టేపు ఇప్పుడు రాష్టంలో సంచలనంగా మారింది. ఇదే ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఐఏఎస్ ల మధ్య వివాదనికి కారణం అయ్యింది. ఇంతకుముందు ఐఏఎస్ లు టీడీపీ ఏజెంట్లలా పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ నేత, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనుక ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్ ల హస్తముందని ఆయన ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా వారు అడ్డుకుంటున్నారని… వారు తమ బాధ్యతలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఒకరు ఏమో వైసిపి ఎమ్మెల్యేలు జిల్లాలో ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రభుత్వానికి చేరవేస్తుంటే ఇంకొకరు రాయభారాలు నడుపుతున్నారు అని, మరొకరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా అడ్డుకుంటున్నారని సరైన సమయంలో ఆధారాలతో సహా ఐఏఎస్‌ల బాగోతం బయటపెడతానని విజయసాయి రెడ్డి అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంగతి తేలుస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
విజయసాయి రెడ్డి ఆరోపణలపై టీడీపీ నాయకులు కూడా తీవ్రంగా స్పందించారు. అవినీతి కేసుల్లో రెండో ముద్దాయిగా ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారులు పిలిస్తే పరిగెత్తే అసమర్థులా మీ ఎమ్మెల్యేలు అని నిలదీశారు. వైఎస్ హయాంలో 12 మంది ఐఏఎస్‌లు జగన్ స్వార్థానికి కేసుల్లో ఇరుక్కున్నారని, కోర్టు బోనులో వారు నిలబడాల్సి వచ్చిందని మండిపడ్డారు. అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయసాయిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదన్నారు. టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అయితే ఏకంగా విజయ సాయిరెడ్డికి తీవ్ర హెచ్చరికలే జారి చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లను బెదిరిస్తున్నారు ఏమనుకుంటున్నారు వైసీపీని కూకటివేళ్లతో పెకిలిస్తాం,
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి గురజాల ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై విజయసాయి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు గుప్పిస్తున్నారని… ఇది సరైన పద్ధతి కాదని, ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ‘వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు, మా అంతు చూసేది లేదు’ అని ఎద్దేవా చేశారు.
స్పందించిన ప్రభుత్వ అధికారుల సంఘాలు
సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర రావులను ఉద్దేశించి విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. తాము అధికారంలోకి వస్తే సతీష్ చంద్ర సంగతి చూస్తామని విజయసాయి రెడ్డి హెచ్చరించడం బాధ్యతారాహిత్యమంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సతీష్ చంద్ర నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని, అమరావతి నుంచి పాలన సాగేలా తగిన ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారని ఐఏఎస్ అధికారుల సంఘం తెలిపింది. అనేక సవాళ్లతో లక్ష్యాలను సాధించేందుకు శ్రమిస్తున్న సివిల్ సర్వీస్ అధికారుల మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఇదే విషయంపై ఐపిఎస్ సంఘం కూడా స్పందించింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పోలీసు వ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నాం అధికారులపై రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేయడం సరికాదు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఐపీఎస్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల నేతలు తమపై విమర్శలు మానుకుంటే మంచిది అంటూ హితావు పలికారు.