Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెట్ సంచలనం విరాట్ కోహ్లీకి మనదేశంలోనే కాదు… ప్రత్యర్థిదేశం పాకిస్థాన్ లోనూ వీరాభిమానులున్నారు. ఈ విషయం ఇంతకు ముందు చాలా సార్లు రుజువయింది. గతంలో విరాట్ కోహ్లీకి మద్దతు పలికినందుకు ఓ పాకిస్థానీ అభిమానికి ఆ దేశం జైలు శిక్ష కూడా విధించింది. అయినా పాకిస్థానీయులు కోహ్లీ మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు వెనుకాడటం లేదు. ఇటీవల టీచర్స్ డే సందర్భంగా విరాట్ కోహ్లీ చేసిన ఒక పోస్టుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు క్రికెటర్ల పేర్లు రాసి వారి ముందు తాను కూర్చుని ఉన్నట్టుగా విరాట్ ఓ పోస్ట్ చేశాడు.
ఆ పోస్ట్ లో కుంబ్లే పేరును చేర్చకపోవటాన్ని కొందరు నెటిజన్లు తప్పుబట్టారు. అయితే తమ దేశానికి చెందిన దిగ్గజ క్రికెటర్లు జావేద్ మియాందాద్, ఇమ్రాన్ ఖాన్, , ఇంజమాముల్ హక్ వంటి క్రికెటర్ల పేర్లు ఆ పోస్టులో ఉండటంతో పాకిస్థానీయులు కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తారు. తాజాగా మరోసారి పాక్ దేశస్థులు కోహ్లీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆస్ట్రేలియా భారత్ వన్డే సిరీస్ నేపథ్యంలో మైండ్ గేమ్ లో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా జర్నలిస్టు ఒకరు తీవ్రంగా అవమానించాడు. కోహ్లీని స్వీపర్ గా పేర్కొంటూ…గతంలో విరాట్ స్వచ్ఛ్ భారత్ లో పాల్గొంటున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. లాహోర్ లో పాకిస్థాన్ వర్సెస్ వరల్డ్ ఎలెవన్ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభమైన నేపథ్యంలో కోహ్లి ఇలా స్టేడియాన్ని ఊడుస్తున్నాడని ఆ జర్నలిస్టు కామెంట్ చేశాడు. దీనిపై పాకిస్థానీయులు మండిపడుతున్నారు. కోహ్లీకి మద్దతుగా వారు వరుస ట్వీట్లు చేస్తున్నారు.
టెస్టుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటే… ఆస్ట్రేలియా క్రికెట్ టీం ఐదోస్థానంలో ఉందని, గుర్తు చేస్తూ… స్వీపర్ల కన్నా ఆస్ట్రేలియా కింది స్థాయిలో ఉందని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ అంటే ఓ ఆటని, రాజకీయాలు కాదని, లెజెండ్ లాంటి కోహ్లీపై ఇలాంటి ట్వీట్లు చేయొద్దని వారు సూచిస్తున్నారు. పాక్ లో జరుగుతున్న వరల్డ్ ఎలవెన్ టీంలో కోహ్లీ లేనందుకు తమకు చాలా బాధగా ఉందని మరో అభిమాని ట్వీట్ చేయడం విశేషం. మొత్తానికి కోహ్లీ ప్రత్యర్థిదేశంలోనూ అభిమానుల్ని సంపాదించుకోవడం చూస్తే…రెండు దేశాల మధ్య సరిహద్దు తగాదాలు ఉన్నాయి తప్ప ప్రజల మనసుల్లో ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని అర్ధమవుతుంది.
మరిన్ని వార్తలు: