Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోడీపై బాలకృష్ణచేసిన వ్యాఖ్యలు దారుణమని మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తమ ప్రతిస్పందన మరోలా ఉంటుందని, రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా బాలకృష్ణను అడ్డుకుంటామని బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ హెచ్చరించారు. నేర చరిత్ర ఉన్న బాలకృష్ణ ప్రధానిపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్ప వేదికపై ఉండగానే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారని, వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చీరాని హిందీ భాషలో బాలకృష్ణ మోడీపై చేసిన కామెంట్స్ అనుచితంగా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు దీక్ష ధర్మపోరాట దీక్ష కాదని, అధర్మ పోరాట దీక్షని, కనీసం పుట్టినరోజు నాడైనా చంద్రబాబు నిజాలు మాట్లాడితే మంచిదని విష్ణుకుమార్ రాజు, మాధవ్ వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం చంద్రబాబు దీక్షలో పాల్గొన్న బాలకృష్ణ ప్రదానిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. విభజన హామీల అమలు కోసం సామ, దాన, భేద ఉపాయాలు అయిపోయాయని, ఇక మిగిలింది దండోపాయమేనని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీకి అన్యాయం చేసిన మోడీ ఒక ద్రోహి అని, మోడీని కొట్టి కొట్టి తరుముతామని, బంకర్ లో దాక్కున్నా లాక్చొచ్చి బాదుతామని విరుచుకుపడ్డారు. తెలుగులో ప్రసంగిస్తూనే… సడన్ గా హిందీలోకి మారిన బాలకృష్ణ మోడీ రాజ్యాంగంతో పాటు తన భార్యను కూడా గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. దేశంలో రెండో ప్రధాన భాష తెలుగని, ప్రధానిగా ఉన్న మోడీ తెలుగు నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. అప్పట్లో బీజేపీకి అధికార భిక్ష పెట్టింది ఎన్టీఆర్, చంద్రబాబేనని గుర్తుచేశారు. తెలుగువారు పిరికివారు కాదని, చిల్లరరాజకీయాలు చేస్తూ అపహాస్యం చేయొద్దని హెచ్చరించారు. వైసీపీ, బీజేపీ లోపాయకారీ ఒప్పందాలు అందరికీ తెలుసని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యంచెప్పారు. అమరావతి శంకుస్థాపనకు మోడీ మట్టి, పవిత్ర జలాలు తీసుకువచ్చారని, మా దగ్గర మట్టి, నీళ్లులేవా అని ప్రశ్నించారు. ప్రతి ఆంధ్రుడు ఒక్కో గౌతమీపుత్ర శాతకర్ణిలా మోడీపై పోరాటం చేయాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.