అదేంటి ఆటో ఎంపీని ఓడించడం ఏమిటా అనుకుంటున్నారా ? అయితే చదవండి. మామూలుగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలకి ఒక శాశ్వత గుర్తు మిగతా ఇండిపెండెంట్ అభ్యర్దులకి వేర్వేరు గుర్తులు ఇస్తూ ఉంటుంది. అయితే తెరాసకు సంబందించిన కారుని పోలినట్టే ఆటో గుర్తు ఉండడం వలన గత ఎన్నికల్లో తెరాస అభ్యర్ధి వోట్లు చీలి పరాజయం పాలయ్యాడు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఓపీ రావత్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. 11 పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించగా తృణమూల్ కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ మినహా మిగిలిన పార్టీల నాయకులు హాజరయ్యారు.
కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్, బీజేపీ నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి, కే అంథోనిరెడ్డి, ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ సయ్యద్ అమిన్ జాఫ్రీ, సయ్యద్ ముస్తాక్, టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జీ గురుమూర్తి, బీఎస్పీ నుంచి ఎస్ ఎల్లన్న, సిద్దార్థపూలే, సీపీఎం నుంచి నంద్యాల నర్సింహారెడ్డి, జే వెంకటేశ్, ఎన్సీపీ నుంచి ఎస్ రవీందర్, వీ నరేశ్‌గుప్తా హాజరయ్యారు. సమావేశ అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ తెరాసకు అనుగుణంగా పత్రికలు, ఛానళ్లలో వచ్చిన వార్తలపై తాము ఫిర్యాదు చేస్తే అవి తప్పుడు వార్తలని ఎన్నికల కమిషన్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వీడియో సాక్ష్యాలున్నా పట్టించుకోకుండా, తప్పుడు వార్తలని చెబుతూ కమిషన్ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం, తెదేపా నాయకులను దుర్భాషలాడటంపై ఫిర్యాదు చేశామని తెలిపారు. మీడియా, పత్రికలను తెరాస అవసరాలకోసం వాడుతున్న తీరును కమిషన్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత ఛానల్‌ను ఒక్కరోజు చూడాలని కోరామన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణను ఆటంకపరుస్తున్న తీరుపై సీడీలతో సహా ఆధారాలు సమర్పించామని చెప్పారు.
ఇక టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలిన ఆటో, టోపీ, రోడ్డురోలర్, ట్రక్ వంటి గుర్తులను ఈ ఎన్నికల్లో ఎవరికీ కేటాయించవద్దని ఈసీని కోరినట్టు ఎంపీ వినోద్ తెలిపారు. 2014 ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కేటాయించిన ఆటో గుర్తు తమ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణమైందని వివరించామన్నారు. ప్రస్తుతం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి ఆటో గుర్తు కేటాయించారని, దానిని తొలగించాలని కోరినట్టు చెప్పారు. సమాజ్‌వాదీ బ్యాక్‌వర్డ్ పార్టీకి ట్రక్ గుర్తు ఇచ్చారని, దీనిపై పునరాలోచన చేయాలని కోరామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోని చానల్‌లో ప్రకటనలు ఇస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని.. ఆ ప్రకటనల ప్రభావం ఇక్కడ ప్రజలపై ఉంటుందని తెలిపామని చెప్పారు.