Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒక్కడైన వి.వి.వినాయక్ రేంజ్ తగ్గిపోతుందా ?. ఈ మధ్య పరిణామాలు చూస్తుంటే ఆ డౌట్ రాక మానదు. అక్కినేని వారసుడు ని పరిచయం చేస్తూ అఖిల్ తీసాక ఇంకో సినిమా కోసం వినాయక్ చాలా రోజులు ఆగాల్సి వచ్చింది. అయితే సాక్షాత్తు మెగా స్టార్ చిరంజీవి పిలిచి మరీ ఖైదీ నెంబర్ 150 ఛాన్స్ ఇచ్చారు. ముందు సినిమా హిట్, ప్లాప్ అన్న మాట పక్కనబెట్టి వినాయక్ మీద అపార నమ్మకం ఉంచారు చిరు. ఆయన 150 వ సినిమా చేయడానికి టాప్ దర్శకులంతా క్యూ కట్టినా చిరంజీవి మాత్రం వినయ్ ను ఎంచుకున్నారు. మెగా స్టార్ నమ్మకం వమ్ము చేయకుండా ఖైదీ నెంబర్ 150 తో సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు వినాయక్.
అయితే అందరూ అనుకున్నట్టు కాకుండా ఖైదీ నెంబర్ 150 తర్వాత వినాయక్ కి ఆఫర్లు రాలేదు. కాస్త ఆలస్యంగానే సి. కళ్యాణ్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా తర్వాత అయినా పెద్ద హీరోతో వినాయక్ సినిమా ఉంటుందని ఆయన అభిమానులు ఊహించారు. కానీ సాయి ధరమ్ తేజ్ సినిమా తర్వాత నల్లమలుపు బుజ్జి నిర్మాతగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో వినాయక్ సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే సినిమా తర్వాత సినిమా మీడియం రేంజ్ హీరోలతో వినాయక్ ఫిక్స్ అయిపోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు రాజమౌళికి దీటుగా నిలిచిన వినాయక్ కి పెద్ద హీరోల నుంచి పిలుపు రాకపోవడానికి కారణం ఏమిటో తెలియడం లేదు. కొద్దిమంది మాత్రం వినాయక్ రొటీన్ మాస్ సినిమాలు చేస్తారు కాబట్టే ఛాన్స్ రావడం లేదు అంటున్నారు. అయితే పెద్ద హీరోలు చేసిన చాలా సినిమాలు అంతకు మించి గొప్పగా ఏమీ లేవు.
ఇక అదుర్స్ సీక్వెల్, రామ్ చరణ్ తో మూవీ అని వినాయక్ గురించి వార్తలు అయితే వస్తున్నాయి కానీ అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఇప్పుడు వరసగా చిన్న హీరోలతో సినిమాలు చేయడం సరికాదని కొందరు అంటున్నా వాటితో హిట్స్ కొట్టి పెద్ద అవకాశం తీసుకుంటాను తప్ప ఎవరినీ రిక్వెస్ట్ చేయనని వినాయక్ అంటున్నారట. నిజంగా వినాయక్ కోరిక తీరాలని, ఆయన మళ్లీ టాప్ స్లాట్ లోకి రావాలని ఆశిద్దాం.