రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ తరువాత వరంగల్‌ను అన్ని రంగాల్లో అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతున్నదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇందులో భాగంగా వరంగల్‌ను మెడికల్ హబ్‌గా మారుస్తామని వారు స్పష్టం చేశారు. ఆదివారం ఎంజీఎం దవాఖానను, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి నిర్మిస్తున్న నూతన భవన పనులను మంత్రులు తనిఖీ చేశారు. అనంతరం కాకతీయ మెడికల్ కళాశాల అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నదని, ఈ క్రమంలో ఉత్తర తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న వరంగల్ ఎంజీఎం దవాఖానలో అన్ని సౌకర్యాలను పది రోజుల్లో కల్పిస్తామన్నారు. కేఎంసీలో రూ.150 కోట్లతో 150 పడకల సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలను తొందరలో ప్రారంభిస్తామన్నారు.
ఇక్కడి నుంచి ఏ ఒక్క రోగి కూడా హైదరాబాద్ వరకు వెళ్లకుండా ఈ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో ఐదేండ్లపాటు పని చేసిన వారికి కోరిన చోటుకు బదిలీలు చేయనున్నట్టు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎంజీఎంలో అన్ని పరికరాలు దెబ్బతిన్నాయని, పరీక్షలకు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సమావేశంలో ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపనేని నరేందర్, అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, సతీశ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ సుదీర్‌కుమార్, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, వైద్య, విద్యా సంచాలకులు రమేశ్‌రెడ్డి, మేయర్ గుండా ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.