ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. మరో 5 రోజుల పాటు ఏపీలో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం శుక్రవారం తుఫానుగా బలపడింది. వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్ తీరంలో కేపుపరాకు సమీపంలో తుఫాన్ తీరం దాటిందని తెలిపారు. శనివారానికి ఈ తుఫాన్ బలహీన పడుతుందన్నారు.
నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో మరో ఊపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ.