రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. వివిధ జిల్లాల్లో వడగాలులు తీవ్రరూపం దాల్చాయి. నిన్న 97 మండలాల్లో వడగాలులు, 21 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీలు, వైయస్ఆర్ జిల్లా చిన్న చెప్పల్లిలో 43.9, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8, ప్రకాశం జిల్లా దరిమడుగులో 43.6, అనంతపురం జిల్లా తెరన్న పల్లిలో 43.5, నెల్లూరు జిల్లాలోని మనుబోలు, తిరుపతి జిల్లా చియ్యవరంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలులు ఎక్కువ వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ‘నైరుతి దిశగా వీస్తున్న పొడిగాలుల కారణంగా రాబోయే రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం 2-3 డిగ్రీలు పెరిగి.. 26-27 డిగ్రీలుగా నమోదవుతాయి’ అని సూచించింది.