భార్య పోలీస్ భర్తకి మరో ప్రియురాలు, ఆమె కోసం ఈయన క్రైం చేయడం, ఇదేదో క్రైం స్టోరీలా ఉంది కదూ. ఇదంతా నిజమే భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రియురాలి సాయంతో కోట్లు కూడబెట్టాలనుకున్నాడు ఆ కిలాడీ కేటుగాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ క్రైమ్ కహానీలో ట్విస్ట్‌లు చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఇండోర్‌కు చెందిన మహిళ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోంది. లగ్జరీ జీవితానికి అలవాటుపడిన ఆమె భర్త మరో మహిళతో పరిచయం పెంచుకున్నాడు. కొద్ది రోజులుగా అతడు ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. అప్పుడే తన క్రిమినల్ బ్రెయిన్‌కు ఎస్ఐ భర్త పదునుపెట్టాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకొని డబ్బు సంపాదించాలనుకున్నాడు. వెంటనే ఎస్ఐ భర్తకు ఓ ఐడియా వచ్చింది. తన భార్య యూనిఫాంను తీసుకెళ్లి ప్రియురాలికి ఇచ్చాడు.. ఓ నకిలీ ఐడీ కార్డును రూపొందించాడు. ఎస్ఐ హోదాను అడ్డుపెట్టుకొని ఎస్ఐలా బిల్డప్ ఇస్తూ ఇద్దరు కలిసి జనాల దగ్గర వసూళ్లు మొదలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడిన సంపాదించిన డబ్బుతో జల్సాలు చేశారు. కొద్దిరోజులు ఈ వ్యవహారం మూడో కంటికి తెలియకుండా సాఫీగానే సాగిపోయింది. కొద్దిరోజుల తర్వాత ఎస్ఐ భర్తగారి ఘనకార్యం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసిపోయింది. వెంటనే అతడ్ని, ప్రియురాల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది ఎస్ఐకి తెలియకుండా ఆమె డ్రస్ కొట్టేసి.. ఇలా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది.