Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావత్ సినిమాపై భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పద్మావత్ ను వ్యతిరేకిస్తూ రాజ్ పుత్ కర్ణిసేన జరిపిన విధ్వంసకాండను పలు దేశాల పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. కర్ణిసేన చర్యలపై ప్రపంచమీడియా దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ముఖ్యంగా గుర్గావ్ లో చిన్న పిల్లల స్కూల్ బస్సుపై కర్ణిసేన రాళ్లదాడులకు దిగడం, ప్రాణభీతితో బస్సులోని పిల్లలు సీట్ల వెనక దాక్కోవడం వంటి దృశ్యాలను ప్రపంచమీడియా ప్రసారం చేసింది. భారీ పెట్టుబడితో, అద్భుత సెట్టింగులతో సంజయ్ లీలా భన్సాలీ కళాత్మకంగా తీసిన పద్మావత్ ఎందుకు వివాదాస్పదం అయిందో, ఆ సినిమాను రాజ్ పుత్ లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమగ్రంగా వివరిస్తూ అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం ప్రచురించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ పత్రికలు కూడా కర్నిసేన విధ్వంసకాండపై వార్తలు ప్రచురించాయి. అయితే శ్రీలంకకు చెందిన ది మిర్రర్ ఆసక్తికర వార్తను ప్రచురించింది. పద్మావత్ లో రాణి పద్మావతిని సింహళ రాజకుమారిగా చూపించారనే వార్త తెలిసి ఆ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా… అని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ్ సింఘే ఎదురుచూస్తున్నారని ఆ పత్రిక తన సంపాదకీయంలో రాయడం విశేషం. పద్మావత్ పై భారత ప్రధాని కూడా అంతే ఉద్విగ్నతతో ఉన్నారన్నది ఆ పత్రిక అభిప్రాయం. అహ్మదాబాద్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తో కలిసి విద్యార్థులు ఇచ్చిన ఘూమర్ ప్రదర్శనను మోడీ తిలకించడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంది. అటు పద్మావత్ సినిమాపై ఓ వైపు కర్ణిసేన నిరసనలు వ్యక్తంచేస్తోంటే… మరోవైపు నెటిజన్లు సోషల్ మీడియాలో పద్మావత్ పైనా, కర్ణిసేన పైనా సెటైర్లు వేసుకుంటున్నారు.
పద్మావత్ సినిమా క్లయిమాక్స్ చూస్తున్న వారందరూ థియేటర్ నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నారని ఒకరు సెటైర్ వేయగా… మరొక నెటిజన్ డియర్ కర్ణిసేనా… మా ఆవిడ పీవీఆర్ థియేటర్ లో సినిమా చూస్తోంది. దయచేసి అక్కడకు వెళ్లండి అని కామెంట్ చేశాడు. కర్ణిసేన వాళ్లు పద్మావతి గురించి ఓ డాక్యుమెంటరీ తీసి విడుదలచేయాల్సింది. ఆ డాక్యుమెంటరీ పద్మావత్ ఇంటర్వెల్ సమయంలో వేస్తే అటు చరిత్ర పాఠం, ఇటు సంజయ్ పాఠం రెండూ అర్ధమయ్యేవి అని ఒక నెటిజన్ ఛలోక్తి విసిరాడు. సినిమాలో యుద్ద సన్నివేశం, థియేటర్ బయట యుద్ధసన్నివేశం ఒకేలా ఉన్నాయని ఇంకో నెటిజన్ సెటైర్ వేశాడు. అటు ఇప్పటిదాకా రాజ్ పుత్ లు, బీజేపీ నేతలే ఈ సినిమాను వ్యతిరేకిస్తుండగా… తాజాగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పద్మావత్ కు వ్యతిరేక స్వరం వినిపించారు. కొన్ని రాష్ట్రాల్లో సినిమా విడుదలను కర్ణిసేన అడ్డుకోవడాన్ని సమర్థిస్తున్నట్టుగా దిగ్విజయ్ మాట్లాడారు. ఓ మతాన్ని గానీ, కులాన్ని గానీ కించపరిచే ఏ సినిమాలను కూడా అసలు విడుదల కానివ్వొద్దంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి చిత్రాన్ని అసలు తీయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్ పుత్ ల ఆందోళనకు ప్రధాని మోడీ, బీజేపీ కారణమని ఆయన ఆరోపించారు. గుర్గావ్ లో స్కూల్ బస్సుపై జరిగిన దాడిపై స్పందిస్తూ మొత్తం దేశాన్ని బీజేపీ మంటల్లోకి నెడుతోందని దిగ్విజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.