Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ విశాఖలో నిర్వహిస్తోన్న వంచన దీక్షపై ఆర్థికమంత్రి యనమల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ ప్రకటన విడుదల చేసిన యనమల వైసీపీ అధినేత జగన్ పై విరుచుకుపడ్డారు. వంచకులకు నయవంచన దినం పాటించే అర్హత ఉందా అని నిలదీసిన యనమల 12 ఛార్జిషీట్లలో నిందితుడిగా ఉన్న జగన్ వంచకుడని, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని, లక్ష కోట్లు సంపాదించారని ఆరోపించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పేదలకు సేవ చేసిన చంద్రబాబును వంచకుడనడం జగన్ అవివేకమని, నిజమైన వంచకుడెవరో ప్రజలందరికీ తెలుసని యనమల వ్యాఖ్యానించారు.
పేదలసొమ్ము దోపిడీ చేసి ఎస్టేట్లు నిర్మించుకున్న జగన్ ను మించిన వంచకుడెవరని, హైదరాబాద్ లోని లోటస్ పాండ్, బెంగళూరులోని ఎలహంక, ఇడుపులపాయలో రాజభవనాలు నిర్మించింది పేదల సొమ్ముతో కాదా అని ప్రశ్నించారు. విభజన సమయంలో సోనియాతో లాలూచీ పడి బెయిల్ తెచ్చుకున్న జగన్, కేసుల మాఫీకోసం ఇప్పుడు బీజేపీతో లాలూచీ పడుతున్నారని ఆరోపించారు. పోలవరంపై ఫిర్యాదులు, కోర్టుకేసులతో అడ్డుకోవడం, రాజధానిపై కోర్టు కేసులు వేయించి ల్యాండ్ పూలింగ్ అడ్డుకోవడం వంచన కాదా… అని యనమల ప్రశ్నించారు. వారంలో నాలుగురోజులు పాదయాత్ర, రెండురోజులు లాయర్లతో భేటీ, ఒక రోజు కోర్టు బోనెక్కడం వంచనకాదా అని అడిగిన యనమల నమ్మకద్రోహం చేసిన బీజేపీని విమర్శించకపోవడమే జగన్ నయవంచనకు నిదర్శనమని మండిపడ్డారు. వంచకుడే వంచన దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మోడీని ప్రశ్నిస్తే బేడీలు పడతాయని జగన్ భయపడుతున్నారని యనమల ఎద్దేవా చేశారు.