వైసీపీ తరఫున ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన 11 మంది అభ్యర్థులు ఎన్నికల ఫలితాలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని, రీ కౌంటింగ్ జరపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ 11 మందిలో తొమ్మిది మంది వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన నేతలు కోర్టును ఆశ్రయించగా విజయవాడ తూర్పు, కుప్పం నియోజకవర్గాల్లో మాత్రం ఇతర నేతలు పిటిషన్లు వేశారు. ఈ స్థానాల్లో అభ్యర్థులందరూ స్వల్ప తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఎన్నికల ఫలితాలపై ఏవైనా అభ్యంతరాలుంటే.. ఫలితాలు వచ్చిన 45 రోజుల్లోపే పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువు ముగుస్తుండటంతో ఒకేసారి పదకొండు మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ నుంచి బోండా ఉమ పిటిషన్ వేశారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కుప్పం ఎమ్మెల్యేగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గెలుపు చెల్లదంటూ వైఎస్సార్సీపీ నేత అన్నస్వామి సుబ్రమణ్య విద్యాసాగర్, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి రామ్మోహన్ నాయుడు గెలుపును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీను, పెద్దాపురం నియోజకవర్గం నుంచి మాజీ హోమంత్రి చినరాజప్ప గెలుపును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి తోట వాణి, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గెలుపును సవాల్ చేస్తూ శ్రీనివాసరెడ్డి, రేపల్లె నుంచి అనగాని ప్రసాద్ గెలుపును సవాల్ చేస్తూ మోపిదేవి వెంకటరమణ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి మద్దాలిగిరి గెలుపును సవాల్ చేస్తూ చంద్రగిరి ఏసురత్నం విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలుపును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి కమ్మెల కన్నప్పరాజు, చీరాలలో కరణం బలరాం గెలుపును సవాల్ చేస్తూ ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును, పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు గెలుపును సవాల్ చేస్తూ ఆచంట వాసుదేవరావు, రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపును సవాల్ చేస్తూ ఆకుల వీర్రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇక రాజోలు నుంచి జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గెలుపును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వర రావు పిటిషన్ దాఖలు చేశారు.