రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలకు మా పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని కోడెల చేసిన విజ్ఞాపన నేపథ్యంలో ఈ బహిరంగ లేఖ రాస్తున్నామని పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను అధికార పక్షం సీట్లలో కూర్చోబెట్టి సభ నడుపుతున్న స్పీకర్ వారిని ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి కాపాడుతున్న స్పీకర్ ప్రజాస్వామ్య వాక్కులు వల్లించటం చూసిన తరువాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నామని వారు లేఖలో పేర్కొన్నారు.
రేపటి నుంచి మీరు పెడుతున్న అసెంబ్లీ సమావేశాలకు మేం హాజరుకావటానికి సిద్ధంగా ఉన్నామని కానీ ఈ రోజే మీ ఫిరాయింపు మంత్రులు నలుగురిని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు 22 మందిని తక్షణం పదవుల నుంచి తొలగించండి. ప్రజా స్వామ్య దేవాలయంలో ఉన్న మీ దొంగ సొత్తును ఈరోజే బయటపడేయండి. ఇదే విషయాన్ని 2017 అక్టోబరులో శాసనసభ సమావేశాల సందర్భంగా చెప్పాం. ఆ తర్వాత మరో లేఖ వ్రాసమని ఇప్పుడు మరోసారి చెపుతున్నామని ఈ రోజే వారిని తొలగించండి, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు తప్పక హాజరవుతామని ఆ లేఖలో వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.