‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలతో ఓవర్ నైట్‌లో విజయ్ దేవరకొండ స్టార్ అయిన విషయం తెల్సిందే. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘ఏమంత్రం వేశావే’. రెండు భారీ విజయాల తర్వాత విజయ్ దేవరకొండ నుండి రాబోతున్న చిత్రం అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని మొదటి నుండి ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక ఈ చిత్రం సైలెంట్‌గా తెరకెక్కి విడుదలకు సిద్దం అయ్యింది. ఉన్నపళంగా ఈ చిత్రాన్ని ఈనెల 9న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా థియేటర్ల బంద్ కొనసాగుతుండగా తాజాగా బంద్‌ను ఎత్తి వేయడం జరిగింది. బంద్ ఎత్తివేయడంతో ఈ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయ్యింది.
టాలీవుడ్లో ఫిబ్రవరి మరియు మార్చిల్లో సినిమాలు విడుదల చేయడం అంటే చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు నెలలుగా కూడా పరీక్షల సీజన్ అవ్వడంతో పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపించరు. చిన్న సినిమాలు కూడా ఎక్కువగా విడుదల కావు. అలాంటిది విజయ్ తన చిత్రాన్ని హఠాత్తుగా విడుదల చేసేందుకు ముందుకు తీసుకు రావడం అందరికి షాకింగ్‌గా ఉంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా విజయ్ దేవరకొండకు ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా నిరాశ పర్చడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. రెండు వారాల తర్వాత విడుదల చేసి ఉంటే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం. అయితే పెద్ద సినిమాలు వరుసగా రాబోతున్న నేపథ్యంలో చేసేది లేక ఇలా అన్ సీజన్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.