Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- అప్పుడు 5, 10 ఏళ్లు కాదు… 15 ఏళ్లు కావాలన్నారు
- ఇప్పుడు ప్రయోజనమే లేదంటున్నారు
అనంతపురం యువభేరీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జగన్ విమర్శలు కురింపించారు. హోదా పేరుతో అధికారంలోకి వచ్చిన పాలక ప్రభుత్వాలు ఏపీ ప్రజల్నిమోసం చేశాయని జగన్ మండిపడ్డారు. విభజనతో జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే పూడ్చగలదని ఆయన అభిప్రాయపడ్డారు. మూడున్నరేళ్ల కాలంలో వైపీపీ ఢిల్లీ నుంచి గల్లీదాకా పోరాటంచేసిందని, తాను రెండు నిరాహార దీక్షలు కూడా చేశానని జగన్ తెలిపారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో వైసీపీ రెండుసార్లు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిందని, బంద్ లను విఫలం చేయడానికి ముఖ్యమంత్రి బస్సులు తిప్పించారని జగన్ ఆరోపించారు. హోదా హామీ నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీ వెళ్లి మూడు, నాలుగు సార్లు ప్రధానిని కలిసి వినతిపత్రాలిచ్చామని, పార్లమెంట్, అసెంబ్లీల్లోనూ తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు గట్టి పోరాటం చేశారని , వైసీపీ ప్లీనరీలోనూ హోదాపై తీర్మానం చేశామని జగన్ తెలిపారు.
అధికారంలో ఉన్న వారి చెవులు మూసుకుపోయిన పరిస్థితుల్లోనూ వైసీపీ మాత్రం పోరాటం కొనసాగిస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఎంత అవసరమో ప్రజలందరికీ అర్దమైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం అర్దం కావడం లేదని, కేవలం తన స్వార్థంకోసం ఆయన హోదాని పణంగా పెట్టారని జగన్ విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం హోదాకు వ్యతిరేకంగా ఉందని, ఏపీకి హోదాను మించిన ప్యాకేజీ తీసుకొచ్చానని చంద్రబాబు చెబుతున్నారని, ఇవి అబద్ధాలని జగన్ ఆరోపించారు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని, వారి జనాభా దేశజనాభాలో 6.2శాతమని, కేంద్రం అందించే నిధుల్లో 14.06శాతం నిధులు ఆ రాష్ట్రాలకే వెళ్లాయని, దేశ జనాభాలో 4.08 శాతంగా ఉన్న ఏపీకి అంతంతమాత్రంగా నిధులు మంజూరుచేశారని, అదే ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఉంటే పెద్ద మొత్తంలో నిధులు అందేవని… జగన్ కేటాయింపుల లెక్కలు వెల్లడించారు. ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు, ఆస్పత్రులు, స్కూళ్లు వస్తాయని, అవి ఉంటేనే పిల్లలకు ఉద్యోగాలొస్తాయని జగన్ వివరించారు.
పన్ను మినహాయింపుల గురించి మాట్లాడుతూ జగన్ చంద్రబాబుపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కొత్త పరిశ్రమలు పెట్టేవారు పన్నుమినహాయింపులు ఉంటేనే రాష్ట్రానికి వస్తారని, అంతేకానీ, చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి కాదని జగన్ వెటకారం చేశారు. చంద్రబాబు తన మీడియాను ఉపయోగించి హోదాతో ప్రయోజనం లేదని ప్రజల్ని మభ్యపెడుతున్నారని, ఇది దారుణమని జగన్ మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో అనేక లాభాలు ఉన్నాయి కాబట్టే… విభజన సమయంలో అధికార, ప్రతిపక్షాలు హోదాపై గట్టిగా మాట్లాడాయని, హోదా ఐదేళ్లు, పదేళ్లు కాదని, పదిహేనేళ్లు కావాలని డిమాండ్ చేశాయని గుర్తుచేశారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చాక నేతలు ప్లేటు ఫిరాయించారని, ప్రత్యేక హోదా సంజీవనా… అని ప్రశ్నించి ఏపీ ప్రజల ఆకాంక్షలను అవమానిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు కాకుంటే ప్రజాస్వామ్యం పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిఉంటే… ఈ మూడున్నరేళ్ల కాలంలో ఏపీలో అనూహ్య మార్పులు జరిగేయని జగన్ తెలిపారు. ఎన్నోపరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవారని, చదువుకునే యువతకు ఉద్యోగం పై భరోసా కలిగేదని, ఎక్కడికో పోయి ఉద్యోగం వెతుక్కోవాల్సిన అగత్యం తప్పేదని జగన్ వివరించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చంద్రబాబు అంటున్నారని, మరి అలాంటప్పుడు నిధుల విషయంలో ఎందుకు తేడాలు తలెత్తుతున్నాయని జగన్ ప్రశ్నించారు. హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటానికి ప్రజలందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.